Firing on Balakotireddy: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పుల కలకలం రేగింది. తెదేపా నేత బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు.. ఆయన ఇంట్లోకి ప్రవేశించి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వైకాపాలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న ఒంటిపులి వెంకటేశ్వర్లుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. దీని వెనుక వైకాపా హత్తం ఉందని తెలుగుదేశం ఆరోపిస్తుండగా... ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు చెబుతున్నారు.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో తూటాపేలింది. రొంపిచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై దుండగులు... కాల్పులకు తెగబడ్డారు. బాలకోటిరెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. 2తూటాలు బాలకోటిరెడ్డి పొత్తి కడపులోకి దూసుకెళ్లాయి. వెంటనే ఆయనను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో...మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. ఈ కేసులో వైకాపాలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న ఒంటిపులి వెంకటేశ్వర్లుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాల్పుల వెనుక వైకాపా నేతల హస్తం ఉందని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఇప్పుడు వైకాపా కార్యకర్త ఆరెస్టుతో ఆ ఆరోపణలకు బలం చేకూరుతోంది. కానీ పల్నాడు ఎస్పీ మాత్రం... ఆర్థిక లావాదేవీలే బాలకోటిరెడ్డిపై హత్యాయత్నానికి కారణమని చెప్పారు.
బాలకోటి రెడ్డి పై హత్యాయత్నాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకోటి రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ రక్తదాహానికి ఎంతమంది తెదేపా నేతలు బలికావాలంటూ... అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకోటిరెడ్డిపై దాడి జరగడం ఇది రెండోసారన్న అచ్చెన్న జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.
బాలకోటిరెడ్డిని పరామర్శించిన టీడీపీ నేత అరవిందబాబు: నరసరావుపేట ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలకోటిరెడ్డిని టీడీపీ నేత అరవిందబాబు పరామర్శించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాలకోటిరెడ్డిపై గతంలోనూ హత్యాయత్నం జరిగిందని అరవిందబాబు ఆరోపించారు. దీంతో ప్రాణహాని ఉందని ఎస్పీకి గతంలోనే ఫిర్యాదు చేశాము.. కానీ బాలకోటిరెడ్డికి రక్షణ కల్పించటంలో పోలీసులు విఫలం అయ్యారని అన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి కనుసన్నల్లోనే డ్రగ్స్, గన్ కల్చర్ పల్నాడుకు వచ్చాయని ఆరోపించారు.
ఇవీ చదవండి: