Chandavaram volunteers fired on Minister Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీపై పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చందవరం వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చందవరంలో మంత్రి రజినికి, స్థానిక నేతలకు మధ్య ఏర్పడిన వర్గ విభేదాల వల్ల తమను విధుల నుంచి ఎందుకు తప్పించారు..? అంటూ అధికారులను ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరుకాలేదన్న సాకుతో వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ బాధ్యతల నుంచి తప్పించటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సినిమాల్లో హీరో, విలన్ గొడవపడి సహాయనటుడిని చంపేసినట్లు.. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చందవరంలో మంత్రి రజినికి, స్థానిక నేతలకు మధ్య ఏర్పడిన వర్గ విభేదాలు వాలంటీర్ల ఉద్యోగాలకు ఎసరు తెచ్చాయి. విభేదాల కారణంగా నేతలతో పాటు గ్రామానికి చెందిన వాలంటీర్లు కూడా మంత్రి నిర్వహించిన గడప గడపకు కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈ క్రమంలో కార్యక్రమానికి వాలంటీర్లు రాకపోవడంతో వారిని పెన్షన్ల పంపిణీ బాధ్యతల నుంచి అధికారులు తప్పించారు. ఉదయాన్నే పింఛన్ రాకపోవటంతో లబ్ధిదారులు ఏమైందని ఆందోళన చెందారు. ఆ తర్వాత వాలంటీర్లంతా గ్రామ సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించగా.. సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ.. ''నా పేరు రజిని.. గత రెండు సంవత్సరాలుగా చందవరంలో వాలంటీరుగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇంతవరకు నా వర్క్ పరంగా ఎటువంటి పెండింగ్‌లు లేవు. అటువంటిది ప్రతిసారి ఏ మీటింగ్ ఉన్నా, పింఛన్ పంపిణీ ఉన్నా వాట్సాప్ గ్రూపులో సమాచారం ఇస్తారు. తాజాగా మండల ఆఫీసులో మీటింగ్ ఉందని చెప్పారు కానీ.. కొన్ని కారణాల వల్ల ఆ మీటింగ్‌కి పోలేకపోయాము. దానికి కారణం.. చందవరంలో రెండు వర్గపోరులు ఉన్నాయి. అందుకే ఆ మీటింగ్‌కి హాజరుకాలేదు. దీంతో మా పై అధికారులు మాకు ఫోన్ చేసి మీటింగ్‌కి హాజరుకానుందున మీపై యాక్షన్ తీసుకుంటే మాకు సంబంధంలేదంటూ బెదిరించారు. వాలంటీర్‌గా మేము ఎంతమందికని లోబడాలి. ఒక్క మీటింగ్‌కు రానందుకు విధులన్నుంచి తీసిస్తే.. రెండు సంవత్సరాలుగా చేసిన పని అంత వ్యర్థమా..?'' అంటూ ప్రశ్నించారు.
ఈ విషయంపై సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేపట్టారు. ఇంటింటికీ తిరిగి కాకుండా లబ్దిదారుల్ని ఓ చోటికి పిలిపించి.. పెన్షన్లు పంపిణీ చేశారు. వర్గపోరు కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని వాలంటీర్లు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాలంటీర్ల విషయంలో సక్రమంగా నడుచుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి