YSRCP Government Discrimination On R-5 Zone: రాజధాని అమరావతిలో నివేశన స్థలాలను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తూ మరోవైపు కొంత మందివి రద్దు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మనవారు కాదా? అయితే తొలగించండంటూ అధికార పార్టీ నేతలూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారు. అనుకూలురు కానివారు, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలనుకున్న లబ్ధిదారుల ఏరివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు.
వాలంటీర్లే వడపోత నిర్వహించి అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. నెలకు 300 యూనిట్ల విద్యుత్తు వాడుతున్నారని, పరిశీలనలో సొంతిల్లు ఉందని తేలిందంటూ కొర్రీలు చూపుతున్నారు. ఇలా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మూడు నియోజకవర్గాలకు చెందిన సుమారు 5 వేల 500 మందిని అనర్హులుగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన కృష్ణలంకవాసులేనని తెలుస్తోంది. అనర్హత వేటుపై సమాచారమిస్తూ లేఖలను సిద్ధం చేసిన వీఎంసీ సిబ్బంది చివరి నిమిషంలో నేతల సూచన మేరకు పంపిణీని నిలిపేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో వీఎంసీ పరిధిలో దాదాపు 90వేల టిడ్కో ఇళ్లు నిర్మించాలని తలపెట్టగా కేంద్రం కూడా మంజూరు చేసింది. వీటితో పాటు జక్కంపూడి ఆర్థిక నగరం పేరుతో కుటీర పరిశ్రమల ఏర్పాటు, అక్కడే నివాసాల కల్పనకు నిర్ణయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ రద్దు చేసి కేవలం 24వేల టిడ్కో ఇళ్లకు తుది మెరుగులు దిద్దుతోంది. మిగిలిన యూనిట్లన్నీ పునాదుల్లోనే మిగిలాయి. నాడు టిడ్కో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు వైఎస్సార్సీపీ నాయకులు ఇంటిస్థలం ఇస్తామని హామీలిచ్చారు. ఈ నేపథ్యంలోనే మూడు నియోజకవర్గాల ప్రజలకు జగనన్న కాలనీలు నగరానికి దూరంగా నిర్మిస్తున్నారు. ఐనా ఇంకా 22 వేల 500 మంది మిగిలారు.
వీరికి రాజధానిలో ఇళ్ల స్థలాలిస్తామని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు హామీలిచ్చారు. వీరితో పాటు బందరు కాలువ కట్ట వద్ద నిర్మాణాలు చేపట్టిన వారికి, కృష్ణా నది కరకట్ట నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారికి రాజధానిలో ఇచ్చేందుకు అంగీకరిస్తూ నాడు హామీ పత్రాలనిచ్చారు. ఐతే రాజధాని ఇళ్లు వివాదంలో ఉండటంతో రేపుమాపంటూ వాయిదా వేస్తున్నారు. తాజాగా ఆర్-5 జోన్‌లో లే అవుట్ల ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమందికి మొండిచెయ్యి చూపేందుకు రంగం సిద్ధమైంది.
వీఎంసీ పరిధిలో సెంటు స్థలం పట్టాలను ఈనెల 18న తుళ్లూరులో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు 20 వేల 684 మందికి 569.46 ఎకరాలను కేటాయించేందుకు నిడమర్రు, మందడం, కురగల్లు గ్రామాల్లో 11 లేఅవుట్లు వేస్తున్నారు. కోట్ల విలువైన లే అవుట్ల కాంట్రాక్టును విజయవాడకు చెందిన వైఎస్సార్సీపీ నాయకురాలి భర్తకు నామినేషన్ పద్ధతిపై అప్పగించారు.
ఇవీ చదవండి