YCP MP Ticket Heavy Cost No Demand: గత ఎన్నికల్లో లోక్‌సభ స్థానాల పరిధిలో ఒక్కో సెగ్మెంట్‌కు ఎన్నికల వ్యయం పేరిట 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు అప్పట్లో చెప్పేవారు. ఈసారి దానికి దాదాపు నాలుగు రెట్లు చెబుతున్నట్లు తెలిసింది. ఒక్కో స్థానానికి అంత ఖర్చా అంటూ విన్నవారూ విస్మయానికి గురవుతున్నారు. అధికార వైసీపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన అంశమిది. ఆ పార్టీ ఎంపీలు తాజా పార్లమెంటు సమావేశాల సందర్భంగా కలుసుకున్నప్పుడు దీనిపైనే చర్చించుకుంటున్నారు.
ప్రతిపక్షంలో ప్రగల్భాలు - అందలమెక్కాక నోరు మెదపని వైసీపీ ఎంపీలు
రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలుంటే దాదాపు 15 చోట్ల కొత్తవారిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉంది. టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో అరకు తప్ప శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఏ స్థానానికీ పెద్దగా డిమాండ్ లేదని పార్టీ వర్గాల చర్చల్లో నలుగుతోంది. కొందరు సిటింగ్‌లు శాసనసభకు పోటీ చేస్తామని చెబుతుంటే మరికొందరు బరిలో నిలిచేందుకే జంకుతున్నారు. వారి స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం పార్టీ అన్వేషణ కొలిక్కిరాలేదు.
మచిలీపట్నం, రాజంపేట, కడప స్థానాలను సిటింగ్‌లకే కేటాయించే అవకాశముంది. వారంతా దాదాపు సొంత మనుషులే కావటంతో ఫండ్ గురించి చర్చే లేదు. రిజర్వ్‌డ్ స్థానాలైన బాపట్ల, తిరుపతి, చిత్తూరులతోపాటు బలహీనవర్గాలకు ఇవ్వాలనుకుంటున్న కర్నూలు, అనంతపురం, హిందూపురం వంటి చోట్ల పార్టీ ఫండ్ అడిగే పరిస్థితి కనిపించడం లేదు. నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, నంద్యాల నుంచే ఎన్నికల వ్యయం పేరిట వీలైనంత మేర తీసుకోవాలన్న నిర్ణయానికి పార్టీ పెద్దలు వచ్చారన్న ప్రచారం సాగుతోంది.
లోక్‌సభకు పోటీ అంటే దూరం - అసెంబ్లీకి ముందు వరసలో వైసీపీ ఎంపీలు
పల్నాడు పరిధిలోని సిటింగ్ ఎంపీని ఈసారి గుంటూరు నుంచి లోక్‌సభకు లేదా చిలకలూరిపేట నుంచి శాసనసభకు పోటీ చేయించాలన్న ప్రయత్నం జరగ్గా ఆయన విముఖత చూపారని సమాచారం. ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కుటుంబసభ్యుడు ఇటీవల కేసుల్లో ఇరుక్కుపోవడంతో ఆయన ఇబ్బందుల్లో ఉన్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటికే టికెట్ ఖరారైన నాయకుడు ఆ జిల్లా నాయకుల మధ్య విభేదాలు, పార్టీ నేతలకు ఆర్థిక వనరులు సమకూరే ఓ అంశంలో ఏర్పడిన మనస్పర్థలతో తాజాగా సుముఖంగా లేరని సమాచారం.
ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ఎంపీకి ఇతరత్రా ఇబ్బంది లేకున్నా ఖర్చు విషయంలో వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది. ఇంత భారీ మొత్తం తనవల్ల కాదంటూ గోదావరి జిల్లాల పరిధిలోని ఓ ఎంపీ కొద్దినెలల కిందటే చేతులెత్తేసినట్లు సమాచారం. ఆయన అసలు రాజకీయాల నుంచే విరమించుకుంటానని అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. ఒకప్పుడు లోక్‌సభ సభ్యులంటే ఉండే గౌరవం, మర్యాద, పలుకుబడి ఇటీవలి కాలంలో ఏమాత్రం లేవని మెజారిటీ ఎంపీలు భావిస్తున్నారు.
కేంద్రంలో ఏ మంత్రినీ నేరుగా కలిసే అవకాశం లేదు. నియోజకవర్గానికి చెందిన పని అయినా లోక్‌సభాపక్ష నాయకుడికో, పార్లమెంటరీ పార్టీ నేతకో చెప్పాలి. సవాలక్ష పనులతో ఉండే వారికి తీరిక దొరికి కలిస్తే కలిసినట్లు లేకుంటే అంతే! విభజన చట్టం అమలు సహా రాష్ట్రానికి రావాల్సిన అంశాల్లోనూ ఇదే విధానం. అధికార పార్టీకి అనుకూలంగా ఓటేయటానికి తప్ప కేంద్రాన్ని ఏ ఒక్క విషయంలోనూ డిమాండ్ చేసేది లేదు సాధించేది అంతకన్నా లేదు. చివరికి పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో లాంఛనప్రాయంగా నిర్వహించే ఎంపీల సమావేశాలూ ఇటీవల సక్రమంగా జరగడం లేదు. ఇంత మాత్రానికే ఈ పదవి ఎందుకన్నట్లు కొందరు భావిస్తున్నారు.
వైసీపీ ఎంపీలు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు.. అసెంబ్లీ ఎన్నికకు సిద్ధమవుతున్న ఎంపీలు