Kanaka Durga Temple Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిలో వివిధ భాగాలను, కౌంటర్లను ఆలయ పాలక మండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఇతర సభ్యులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసాదం తయారికి వినియోగిస్తున్న ముడి సరుకుల, నాణ్యత, బరువు, పరిశుభ్రతలను పరిశీలించారు. టెండర్‌లో పొందుపొరిచిన నాణ్యత, ప్రమాణాల మేరకు ముడిసరుకులు సరఫరా అవుతున్నాయో లేదోనని ప్రత్యక్షంగా ఆరా తీశారు. పల్లీలు, బియ్యం, కిస్మిస్‌లు, జీడి పప్పులు ఇలా అన్ని సరుకులను తనిఖీ చేశారు. పరిస్థితిని చూసి పాలకమండలి సభ్యులు కంగుతిన్నారు. ప్రసాదం తయారీకి ఇలాంటి నాసిరకం సరకులు వాడుతున్నారా ఇవన్నీ రెండో రకం సరుకులే కదా అని సిబ్బందిని ప్రశ్నించారు.
అక్రమాలు .. విజిలెన్స్: రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయమైన దుర్గమ్మ గుడికి ఏటా రెండు కోట్ల మంది వరకూ భక్తులు వస్తుంటారు. వంద కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. కనక దుర్గమ్మ ఆలయ లడ్డూ, పులిహోర ప్రసాదానికి దశాబ్దాల చరిత్ర ఉంది. అలాంటి ప్రసాదాల తయారీ కోసం వినియోగించే సరకుల్లో నాణ్యత సరిగా ఉండడం లేదంటూ చాలా కాలంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయంలోని ప్రసాదాలు, పూజలు సహా అన్నింటికీ కలిపి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తుండగా నెలకు ఒకటిన్నర కోటికి పైగా గుత్తేదారులకు చెల్లిస్తుంటారు. టెండరు దక్కించుకున్నప్పుడు గుత్తేదారు చూపించే మొదటి రకం నాణ్యమైన సరకులను చూసే ఎంపిక చేసి ఆ తర్వాతా అంతే నాణ్యత ఉందా లేదా అని ఆలయ స్టోర్స్ సిబ్బంది చూడాలి. ఐతే సరకు నాణ్యతను తగ్గించి ఇక్కడే అక్రమాలకు తెరతీస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల కిందట విజిలెన్స్ తనిఖీల్లోనూ ఇదే విషయం బహిర్గతమైంది. ఐనా ఆలయ అధికారులు, సిబ్బందిలో ఏ మాత్రం మార్పు రాలేదు.
కర్నాటి రాంబాబు పరిశీలన: ప్రసాదం తయారీలో నాసిరకం సరుకుల వినియోగం నిజమేనన్న ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఇక నుంచి పరిశీలనకు పాలక మండలిలోని ఓ వ్యక్తిని నియమిస్తున్నట్లు చెప్పారు. ఆకస్మిక తనిఖీల ద్వారా ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి