TDP state president Atchannaidu on fire on CM Jagan: శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో గతరాత్రి టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు ఇంటి ముందున్న కల్వర్టు విషయంలో.. అధికారులు, అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రవర్తించిన తీరుపై.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు రోజురోజుకీ మితిమిరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానురానూ వైసీపీ నేతలు హద్దు మీరి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
కల్వర్ట్ కూల్చివేతకు అధికారులు యత్నం.. పలాస కాశీబుగ్గ పట్టణంలో నివాసముంటున్న తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు.. పదిహేనేళ్ల కిందట ఇంటికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు కాలినడకన వెళ్లే మార్గంలోని సాగునీటి కాలువపై ఓ కల్వర్టును నిర్మించుకున్నారు. ఈ క్రమంలో గతరాత్రి అది అక్రమం అంటూ కల్వర్టును తొలగించేందుకు అధికారులు శనివారం అర్ధరాత్రి హంగామా చేశారు. కల్వర్టును తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు కాశీబుగ్గ పట్టణానికి చేరుకుని.. నాగరాజుకు సంఘీభావం తెలిపారు. దీంతో రాత్రి 11.30 గంటల సమయంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించి.. టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
'ఆవు చేలో మేస్తే-దూడ గట్టున మేస్తుందా'.. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ..''పలసా కాశీబుగ్గ మున్సిపాలిటి టీడీపీ నేత నాగరాజు ఇంటి ముందు ఉన్న కల్వర్టు కూల్చివేయటం దుర్మార్గం. జగన్ రెడ్డి ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. నాకది-నీకిది అనే పద్దతిలో పరిపాలన సాగిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ఇడుపుల పాయలలో నిర్మించిన రాజ ప్రసాదాలకు ఏం సమాధానం చెబుతారు సీఎం జగన్..?. మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమాలను నిరంతరం ఎండగడుతున్నందుకే.. నియోజకవర్గంలోని టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. నాగరాజుకు సంఘీభావం తెలపడానికి వెళ్లిన టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తారా..?. 'ఆవు చేలో మేస్తే-దూడ గట్టున మేస్తుందా' అన్న చందంగా వైసీపీ నేతల తీరు ఉంది'' అని ఆయన ఆక్షేపించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ కూలడం ఖాయం.. అంతేకాకుండా, జగన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఇంటిని టార్గెట్ చేస్తే.. గ్రామ స్ధాయిలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ సైకో లక్షణాలను ఆ పార్టీ కార్యకర్తలు కూడా అనుసరిస్తున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు.. రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, నాగరాజు, బెందాలం అశోక్, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలించమని ప్రభుత్వానికి అధికారమిస్తే.. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కూల్చివేతలతో మొదలైన జగన్ ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పుతో కూలడం ఖాయమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.