TDP protest Against ycp : బలహీనవర్గాలను వైసీపీ అంటరానివారిగా చూస్తోందని.. ఒంగోలు తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. బీసీల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ "ఇదేం ఖర్మ బీసీలకు' కార్యక్రమం నిర్వహించారు. అద్దంకి బస్టాండ్ సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి.. ఆ తర్వాత భిక్షాటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అనేక పథకాలను రద్దు చేశారని.. బీసీ కార్పొరేషన్లకు కనీస నిధులివ్వడం లేదని మండిపడ్డారు.
కొండెపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాశనం చేశారంటూ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి నిరసన ప్రదర్శన చేశారు. మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యాన ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. దర్శిలో నియోజకవర్గ పరిశీలకుడు బీసీ జనార్దన రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాపారావు.. ప్రజల సమస్యలు నమోదు చేసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఆధ్వర్యంలో బీసీ నాయకులు ధర్నా చేశారు. బీసీల సమస్యలపై అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ.. కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. సబ్‌ప్లాన్ నిధులను బీసీ వర్గానికే ఖర్చు చేయాలని.. గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జి నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.
రాజమహేంద్రవరంలో 25 మంది ఆర్టీసీ డ్రైవర్లను ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి సన్మానించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద డ్రైవర్లకు పూలదండలు వేసి శాలువాలతో సత్కరించారు. గోతుల రోడ్లపై ఎంతో ఓర్పుగా బస్సులు నడుపుతున్నారంటూ అభినందించారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కిమిడి నాగార్జున ఆధ్వర్యాన తెలుగుదేశం నేతలు దీక్ష చేశారు. మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం నేతలు సంధ్యారాణి, చిరంజీవి, జగదీశ్వరరావు నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. శ్రీకాకుళం జిల్లా బురగాంలో ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే బెందాళం అశోక్... ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.
ప్రజలు చెప్పిన సమస్యలను నమోదు చేసుకున్నారు. నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నేతృత్వంలో కార్యకర్తలు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు . వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందంటూ ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయం వద్ద కూన రవికుమార్ సారథ్యంలో నేతలు బైఠాయించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు నివాసం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి.. ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.
సీఎం జగన్ సొంత వర్గానికి ఉన్నత పదవులు కట్టబెట్టి, బీసీలను మోసం చేశారంటూ... కర్నూలు తెలుగుదేశం నేతలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నందవరం మండలం ముగతిలో నిర్వహించిన "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" నిరసనలో... మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పన్నుల మోతను ప్రజలకు వివరించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం నేతలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
ఇవీ చదవండి: