TDP Leaders Complained To EC On Fake Votes: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారీగా దొంగ ఓట్లు, ఓట్ల జాబితాల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, ఓట్ల జాబితాలో ఏ తప్పు జరిగినా.. బీఎల్‌వోలు, కలెక్టర్లే పూర్తి బాధ్యులని.. తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. ఓటర్ల జాబితాలో నెలకొన్న తప్పిదాలు, ఓట్ల నమోదు విషయంలో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ నేతలు.. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, బొండా ఉమ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు ఫిర్యాదు చేశారు.
Achchennaidu Comments: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, 8 మంది కలెక్టర్ల పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ''ఆంధ్రప్రదేశ్‌లో దొంగే దొంగ అన్న చందంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. ఓటర్ల జాబితాలను తర్జుమా చేయటంలోనూ, తెలుదేశం పార్టీ ఓట్లన్నీ తీసివేయడంలోనూ అత్యుత్సాహం కనబరుస్తోంది. మేము కేంద్ర, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులను కలిసి, ఫిర్యాదు చేస్తామని చెప్పగానే.. మాకంటే ముందుగా వెళ్లి ఫిర్యాదులు చేశారు. దీన్ని బట్టి చూస్తే జగన్ రెడ్డి నేతృత్వంలో ఎంత దుర్మార్గం జరుగుతుందో అందరికీ స్పష్టంగా అర్ధమౌతుంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవటం ఖాయం. టీడీపీ ఓట్లను తొలగించి, లేనివాళ్లను ఓటర్లుగా చేర్చే కార్యక్రమానికి వైసీపీ తెర లేపింది. ఈ వ్యవహారానికి కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతున్నారు. అందులో 8 మంది కలెక్టర్లు వైసీపీ కార్యకర్తల పని చేస్తూ.. వైసీపీ అక్రమాలకు ఆమోద ముద్ర వేస్తున్నారు'' అని ఆయన ధ్వజమెత్తారు.
Achannaidu on Palasa incident: ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు: అచ్చెన్నాయుడు
Achchennaidu on 8 Collectors Performance: ఓట్ల జాబితాలో ఏ తప్పు జరిగినా.. బీఎల్‌వోలు, కలెక్టర్లే పూర్తి బాధ్యులని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దొంగ ఓట్లపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోవట్లేదని, అర్జీలను చెత్త బుట్టల్లో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, అన్నమయ్య, బాపట్ల, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైసీపీ కార్యకర్తల మాదిరిగా అక్రమాలకు వంతపాడుతున్నారని దుయ్యబట్టారు. అధికారులు ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని, ఇప్పటికైనా అధికారులు వారి వైఖరిని మార్చుకుని వైసీపీకి వత్తాసు పలకడం మానుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.
Bonda Uma Comments: రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఫిర్యాదు చేశామని.. టీడీపీ నేత బొండా ఉమా తెలిపారు. డిసెంబర్ 10వ తేదీలోపు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఓ బృందం రాబోతుందని ఆయన వెల్లడించారు. ఓట్ల అక్రమాలపై ఆ బృందం దర్యాప్తు చేయబోతుందన్నారు. 8 మంది కలెక్టర్ల పని తీరుపై సాక్ష్యాధారాలతో సహా టీడీపీ ఆ బృందానికి ఫిర్యాదు చేయబోతుందని ఉమ వివరించారు. తాడేపల్లి ఆదేశాలతో ఆ 8 మంది కలెక్టర్లు నిబంధనలకు వ్యతిరేకంగా విధులు నిర్వర్తిస్తున్నారన్న బొండా ఉమా.. త్వరలోనే వారు శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు.
''ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఈసీ నివ్వెరపోతోంది. ఫామ్-6 ద్వారా ఆన్‌లైన్‌లో లేదా బీఎల్‌వోలకు దరఖాస్తు చేయొచ్చు. వైసీపీ నేతలు ఆన్‌లైన్, మ్యానువల్‌గా భారీగా చేయిస్తున్నారు. ఉరవకొండలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశాం. తహశీల్దార్లు తనిఖీ చేయకుండానే జాబితాలో ఓట్లు చేరుతున్నాయి. అర్ధరాత్రి దరఖాస్తులు క్లియర్ చేస్తున్నారు.''-పయ్యావుల కేశవ్, టీడీపీ నేత