TDP leaders expressed doubt on YSRCP: గుంటూరులో ఆదివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై నల్లపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. ప్రమాదంలో మరణించిన రమాదేవి కుటుంబ సభ్యుడు గోపిదేశి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 304-2 రెడ్ విత్ ఐపీసీ 34 కింద కేసు నమోదు చేసినట్లు నల్లపాడు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత ఉయ్యూరు శ్రీనివాస్‌ను A-1గా పేర్కొన్నారు. A-2గా తెలుగుదేశం నేతలను చేర్చారు. సంక్రాంతి కానుక తీసుకునేందుకు వెళ్లినప్పుడు తొక్కిసలాట జరిగి, తన తల్లి మరణించినట్లు గోపిదేశి నాగరాజు చెప్పారని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. అదే ఘటనలో సయ్యద్ ఆసియా, షేక్ బీబీ కూడా చనిపోయినట్లు పోలీసులు వివరించారు.
తొక్కిసలాటలో గాయపడిన వారు క్రమంగా కోలుకుంటున్నారు. జీజీహెచ్‌లో ప్రాథమిక చికిత్స తర్వాత బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రంగాదేవికి ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగంలో రాజేశ్వరి, మస్తాన్‌బీ, సరోజిని అనే మహిళలు కూడా చికిత్స పొందుతున్నారు. స్వల్పంగా గాయపడిన దుర్గ, సౌందర్య, నిర్మలమ్మ, జహురున్నీసాకు జీజీహెచ్‌లో చికిత్స జరుగుతోంది.
జీజీహెచ్‌లో బాధిత కుటుంబాలను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు. ఘటన వెనుక వైకాపాతో పాటు ఐప్యాక్ బృందం ఉందని ఆరోపించారు. పేదలకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థ కార్యక్రమం నిర్వహించిందని... అందులో అతిథిగా పాల్గొన్న చంద్రబాబు వెళ్లిపోయాక జరిగిన ఘటనను ఆయనకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు.
వైసీపీ నేతల విమర్శలు చూస్తుంటే ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతోంది. ప్రతీ ఘటనను చంద్రబాబుకు ఆపాదించడం వైసీపీ నేతలు ఫ్యాషన్‌గా మారిందని ధ్వజమెత్తారు. -నక్కా ఆనందబాబు, టీడీపీ నేత
గుంటూరు ఘటన వెనుక వైకాపా స్లీపర్ సెల్స్ హస్తం ఉందన్న వర్ల రామయ్య... సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
సీఎం, అతని మనుషులు కలిసి నిన్న ముగ్గురిని చంపేశారు . గుంటూరు సభలో అధికార పార్టీ స్లీపర్ సెల్స్ ఉన్నారన్న అనుమానం తమకు ఉంది. గుంటూరు సభలో తొక్కిసలాట జరుగుతుందని ముందే సీఎం, వైసీపీ నేతలకు తెలుసు. చంద్రబాబు సభలకు జనం రాకుండా చేయడానికి వైసీపీ ఆడిన కుట్ర. ముగ్గురు చనిపోతారని వైసీపీకు ముందే తెలుసు కాబట్టి.. ఘటన జరిగిన 5 నిమిషాల్లో మంత్రులు వరుస క్రమంలో హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. -వర్ల రామయ్య, టీడీపీ నేత
ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించినట్లు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన ఆమె... ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వడానికి వీల్లేదని.. మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుంటూరు తొక్కిసలాటకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.
"చంద్రబాబు సమావేశాలు ఎట్టి పరిస్థితిలోనూ బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించటానికి వీల్లేదు. సభకు, సమావేశాలకు ఎంత మంది హాజరవుతున్నారు, ఎన్ని వాహనాలతో ర్యాలీ చేపడ్తున్నారు వంటి వివరాలను పోలీసులకు తెలియజేయాలి." -కొడాలి నాని, మాజీ మంత్రి
ఆదివారం నాటి ప్రమాదంపై గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాసరావుతో పాటు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇతర నేతలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
ఇవీ చదవండి: