TDP leader Somireddy: ఆనాడు ఎలాంటి ఆర్డర్ లేకుండానే డీఎస్పీ బదిలీలపై, తెదేపా ప్రభుత్వంపై వైకాపా అసత్య ఆరోపణలు చేసిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు అధికారికంగా వచ్చిన జీవోపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్ సామాజిక వర్గానికే సలహాదారులు, డీఎస్పీ పోస్టులు ఇవ్వాలా అని నిలదీశారు. మిగిలిన సామాజిక వర్గాలవారు పనికిరారా అని ఆక్షేపించారు.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రైతుల పేరెత్తే అర్హత కోల్పోయారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని ప్రతి ఏటా తగ్గిస్తూ చెల్లింపులు నెలలు తరబడి ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు.. గత ఖరీఫ్‌లో తక్కువగా 40లక్షల టన్నులే ఏపీలో కొనుగోలు చేస్తే, తెలంగాణలో 70లక్షల టన్నుల కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. ఏపీలో ఇంత వరకు పాత బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు.
మంత్రుల కమిటీ ఏర్పాటయ్యాక ఆక్వా రైతులు మరింత నష్టపోయారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి మద్యం సీసా మీద ప్రభుత్వ పెద్దలకు కమీషన్ వెళ్తున్నట్లే.. ఆక్వా మేత మీద కూడా టన్నుకి రూ.5వేలు కమీషన్... ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఏటా 10లక్షల టన్నుల మేత తయారవుతున్నందున ఏటా రూ.500 కోట్ల వసూలుకు ప్రణాళికలు వేసుకున్నారని ఆక్షేపించారు. సీడ్ యాక్ట్, ఆక్వా యాక్ట్ వల్ల ప్రభుత్వ పెద్దల బ్లాక్‌మెయిలింగ్ పెరిగి ఆక్వా రైతులు నిండా మునిగిపోయారన్నారు.
ఇవీ చదవండి: