TDP leader Nilayapalem Vijay Kumar Fire on CM Jagan: వాలంటీర్లపై పర్యవేక్షణ పేరుతో జిల్లాల వారీగా నియమించిన ఐప్యాక్ సిబ్బందికి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు చెల్లించడంపై జగన్ రెడ్డి నోరువిప్పాలని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 'ప్రభుత్వ సొమ్ముతో ఐప్యాక్ సిబ్బంది సోకులు' అంటూ 274కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన వ్యక్తి జగన్ రెడ్డేనని ఆయన ఆరోపించారు. వాలంటీర్లపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక సంస్థను నియమిస్తున్నట్లు.. 2021 జులై 29న అజయ్ జైన్ జీవో ఇచ్చారన్న ఆయన.. జీవో అమలులోకి రాకముందే లెక్కలు ఎలా సేకరించారని ప్రశ్నించారు.
అధికారికంగా జీవో ఇవ్వక ముందే ప్రభుత్వం రామ్ ఇన్ ఫో సంస్థ సేవల్ని వాలంటీర్ల కోసం వినియోగించిందని ఆక్షేపించారు. అందుకు నిదర్శనం 30-06-2020న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి ఇచ్చిన ఉత్తర్వులేనని పేర్కొన్నారు. 2021లో ఇచ్చిన జీవోకి కొనసాగింపుగా వాలంటీర్లపై పర్యవేక్షణ బాధ్యతల్ని రామ్ ఇన్ ఫో, ఉపాధి ఇన్ ఫోటెక్, మాక్స్ సెక్యూరిటీ డిటెక్టివ్ ఏజన్సీస్ సంస్థలకు అప్పగిస్తున్నట్లు, అందుకోసం రూ. 68,62,84,520 చెల్లిస్తున్నట్లు జగన్ రెడ్డి సర్కార్ మరో జీవో ఇచ్చిందని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారానికి జగన్ సర్కార్ ఎఫ్ఓఏ (ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ) అనే ముద్దు పేరు పెట్టిందన్నారు.
ప్రభుత్వం వాలంటీర్లపై పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన రామ్ ఇన్ ఫో సంస్థ సిబ్బంది.. ఐప్యాక్ సిబ్బంది ఒక్కరే అనడానికి లింక్డ్ ఇన్ వెబ్ సైట్ వివరాలే నిదర్శనమన్నారు. ప్రజలసొమ్ముని ఐ ప్యాక్ సంస్థకు దోచిపెట్టి.. సదరు సంస్థ ద్వారా తాను.. తన పార్టీ.. తన ప్రభుత్వం పొందిన లబ్ధి పొందారని.. దీనిపై జగన్ రెడ్డి నోరువిప్పాలని డిమాండ్ చేశారు. మూడు సంస్థల్ని ఎఫ్ఓఏగా చెప్పిన జగన్ సర్కార్.. వాటి సేవల వినియోగం కోసం నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచిందా అని నిలదీశారు. టెండర్లు పిలిస్తే ఎల్-1, ఎల్-2, ఎల్-3 ఎవరు? రూ.274కోట్ల చెల్లింపులకు అసెంబ్లీ, కేబినెట్ అనుమతి ఉందా అని విజయ్‌కుమార్ ప్రశ్నించారు.
"వాలంటీర్లపై పర్యవేక్షణ పేరుతో జిల్లాలవారీగా నియమించిన ఐప్యాక్ సిబ్బందికి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు చెల్లించడంపై జగన్ రెడ్డి నోరువిప్పాలి. వాలంటీర్లపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక సంస్థను నియమిస్తున్నట్లు.. 2021 జులై 29న అజయ్ జైన్ జీవో ఇచ్చారు. అది 2020 జూన్ 30 నుంచే అమలులోకి వస్తుందని చెప్పారు. అయితే జీవో అమలులోకి రాకముందే లెక్కలు ఎలా సేకరించారు..? ప్రభుత్వం వాలంటీర్లపై పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన రామ్ ఇన్ ఫో సంస్థ సిబ్బంది.. ఐప్యాక్ సిబ్బంది ఒక్కరే అనడానికి లింక్డ్ ఇన్ వెబ్ సైట్ వివరాలే నిదర్శనం." - నీలాయపాలెం విజయ్ కుమార్, టీడీపీ అధికార ప్రతినిధి
Public Data to IPAC: 'ఐప్యాక్ చేతిలో రాష్ట్ర ప్రజల డేటా.. ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ కుట్ర'