Health Minister Vidadala Rajini Review Meeting: రాష్ట్రంలో వైరల్ ఫీవర్స్, వడ దెబ్బపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. జూమ్ ద్వారా వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, ఉన్నతాధికారులు, 26 జిల్లాల డీఎంహెచ్వోలు, 16 జీజీహెచ్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. వైరల్ ఫీవర్స్‌పై అప్రమత్తంగా ఉన్నామని క్రిష్ణ బాబు తెలిపారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్న క్రిష్ణ బాబు.. ఏర్పాట్లపై డీఎంహెచ్‌వోలకు పలు ఆదేశాలిచారు.
ఇన్ఫ్లూయంజా వైరస్, వడదెబ్బ తీవ్రతపై కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన సూచనల మేరకు అప్రమత్తంగా ఉన్నామన్నారు. తక్షణం వారం రోజులపాటు ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. వడ దెబ్బకు గురికాకుండా ప్రజల్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థల్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు బయట తిరగకుండా హెచ్చరికలు జారీ చెయ్యాలన్నారు. ప్రజల్లో అవగాహన పెద్ద ఎత్తున కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్లతో డీఎంహెచ్వోలు సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
ఎన్జీవోలతో కలెక్టర్లు సమావేశాన్ని ఏర్పాటు చేసేలా డీఎంహెచ్వోలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. శీతల నీటి కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి, ఓఆర్స్ ప్యాకెట్లు విలేజ్ క్లినిక్‌ల స్థాయిలో సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్ఆర్జియస్ క్యాంపుల్లో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించే విషయంలో ఎమ్ఎల్‌హెచ్‌పీలకు తగిన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఎంఎల్‌హెచ్‌పీలు, ఎఎన్ఎంలు సమన్వంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
వారం రోజుల్లోగా ఫీవర్ సర్వే పూర్తి చేసేలా డీఎంహెచ్వోలు తక్షణమే రంగంలోకి దిగాలన్నారు. విలేజ్ వాలంటీర్ల సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, జన సమ్మర్థ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాలేజీలు, స్కూళ్లలో పరిస్థితులననుసరించి తగిన చర్యలు తీసుకునేలా ఆయా శాఖలకు పలు సూచనలు చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 14వ తేదీన రాష్ట్రంలో నేషనల్ డీవార్మింగ్డే ఏర్పాట్లపై పలు సూచనలు చేసారు.
ఎండీవోల వద్ద నుంచి నులిపురుగు మాత్రల్ని తీసుకునేలా ఎమ్ఎల్హెచ్పీలు , ఏఎన్ఎంలు సమన్వయం చేసుకోవాలన్నారు. రక్తహీనత నివారణలో భాగంగా.. నులిపురుగుల నివారణ అత్యంత అవసరమని స్పష్టం చేశారు. రెండు రోజుల ముందుగానే నులిపురుగుల మాత్రలు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. తక్షణం లక్ష సికిల్ సెల్ కిట్లు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ నెలలో 3 లక్షల సికిల్ సెల్ అనీమియా కిట్ల పంపిణీ లక్ష్యం పెట్టారు.
సికిల్ సెల్ అనీమియా పేషంట్లకు కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. సిజేరియన్ ఆపరేషన్లపై కలెక్టర్లు జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసేలా డీఎంహెచ్వోలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నోటిఫైబుల్ వ్యాధులను నమోదు చేసే విషయంలో ప్రైవేటు ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. డీఎంహెచ్వోలు విజిట్ చేసి పరిశీలించాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అప్లోడ్ చేస్తున్నదీ లేనిదీ పరిశీలించాలని తెలిపారు.
ఇవీ చదవండి: