COMMISSION ON KAKNDUKURU INCIDENT : నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలపై విజయవాడ ప్రభుత్వ అతిథి గృహంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ విచారణ చేపట్టింది. ఈ విచారణకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇంటూరి నాగేశ్వరరావు, తెనాలి శ్రావణ్ కుమార్‌లు హాజరయ్యారు. విచారణ అనంతరం టీడీపీ నేతలు పలు విమర్శలు చేశారు.
కందుకూరు ఘటనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలనే సాక్షులుగా పెట్టించి అధికారులు అసత్యాలు చెప్పిస్తున్నారని కందుకూరు తెలుగుదేశం ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆరోపించారు. సాక్ష్యాలు చెప్పడానికి వచ్చిన వారంతా అధికార పార్టీ నేతలే అనే నిజాన్ని తాము వచ్చే విచారణలో నిరూపిస్తామని స్పష్టం చేశారు. అసలు ఆ కార్యక్రమంతో సంబంధం లేకుండా అక్కడకు ఎలా వచ్చారో కూడా వారు చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారని.. అన్ని ఆధారాలతో మళ్లీ వస్తామని వెల్లడించారు.
గుంటూరు ఘటనలో క్షతగాత్రులు, పాత్రధారులను క్రాస్ ఎగ్జామ్ చేస్తారా అని అడిగారని గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం నేత తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. తాము అనుమతి తీసుకునే కార్యక్రమం నిర్వహించామని విచారణలో చెప్పినట్లు తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకలు ప్రజల మధ్య జరుపుకునేందుకు చంద్రబాబు వచ్చారని.. దురదృష్టవశాత్తు ఆరోజు ఈ విషాదకర ఘటన జరిగిందన్నారు. అనుమతికి సంబంధించిన పత్రాలు అన్నీ ఉన్నట్లు కమిషన్‌కు చెప్పినట్లు తెలిపారు. తమ దగ్గర ఉన్న అన్ని ఆధారాలను కమిషన్‌కు అందజేశామని తెలిపారు.
ఇప్పటికే నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ శేషశయనా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ఫిబ్రవరి 7వ తారీఖున విచారణ చేపట్టింది. ఆ విచారణలో టీడీపీ నేతలు ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేశ్‌లను విచారించింది. ఆ రోజే విచారణపై పూర్తి నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. విచారణ పూర్తి కానీ నేపథ్యంలో ఈరోజు మరోసారి విచారణ చేపట్టింది. అయితే ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రోడ్ షోలు, బహిరంగ సభలను నిషేధిస్తూ జీవో నెం 1 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ కమిషన్ ఇచ్చే నివేదిక కీలకం కానున్నట్లు సమాచారం.
కందుకూరులో అసలేం జరిగిందంటే: గత ఏడాది డిసెంబర్ 28న నెల్లూరులో జిల్లాలోని కందుకూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. పట్టణంలో ఎన్టీఆర్ కూడలి వద్ద సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు అప్పటికే జనం భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. చంద్రబాబు వాహన శ్రేణి వెంట కూడా ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. తోపులాట జరిగిన వెంటనే పక్కనే నిలిపి ఉంచిన మోటార్ సైకిల్లపై కొందరు పడిపోగా.. వారిపై మరికొందరు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ శ్రేణులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే డాక్టర్లు వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన ఫలితం లేకపోయింది. దాంతో ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.
ఇవీ చదవండి: