Retired employees Agitation for Pension: పింఛన్ల కోసం విశ్రాంత ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఎప్పుడూ ఒకటో తేదీనే వచ్చే పింఛన్.. మూడేళ్లుగా ఎప్పుడొస్తుందో తెలియక అవస్థలు పడుతున్నామంటూ రాష్ట్రంలోని పలు కలెక్టరేట్‌ల వద్ద ఆందోళకు దిగారు. పింఛన్ భిక్ష కాదు మా హక్కు అంటూ నినదించారు. తెల్లారితే నాలుగు మెతుకులు లేకపోయినా బతకగలం కానీ.. సమయానికి మందులు వేసుకోకపోతే మాత్రం జీవించలేమంటూ విశ్రాంత ఉద్యోగులు వాపోతున్నారు.
సర్వీస్‌లో ఉన్నంత కాలం.. ఉరుకుల పరుగుల జీవితంతో అలసిపోయిన తాము.. పదవీ విరమణ తరువాత సైతం పింఛన్ల కోసం పోరాటం చేయాల్సిన రావడం దురదృష్టకరమని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదో తేదీ వస్తున్నా ప్రభుత్వం పింఛన్లు చెల్లించకపోవడంతో ఎన్టీఆర్ జిల్లా విశ్రాంత ఉద్యోగులు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావుకు వినతిపత్రం అందించారు. మూడేళ్లుగా పింఛన్లు సక్రమంగా రావడం లేదని ఆరోపించారు. 60 ఏళ్లు ప్రజలకు సేవలు అందించిన తమకు ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నించారు.
ప్రతి నెలా పింఛన్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి రావడంతో నెలవారీ చెల్లింపులు, అప్పులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాపట్ల జిల్లా విశ్రాంత ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఔషధాలు కొనుగోలు చేయలేక అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సైతం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కుటుంబ పోషణకు, వైద్య ఖర్చులకు పింఛనే ఆధారమని ఒంగోలు విశ్రాంత ఉద్యోగులు వేడుకుంటున్నారు. కన్నవారు పట్టించుకోక, పింఛను సకాలంలో అందక నానా యాతన పడుతున్నామన్నారు. పింఛన్ ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని, తమ హక్కు అంటూ ధ్వజమెత్తారు.
ఒకటో తేదీనే పింఛన్లు ఇవ్వాలంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద విశ్రాంత ఉద్యోగులు ధర్నా చేశారు. సంక్షేమం పేరిట బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం.. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు మీరి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తమకు సకాలంలో పింఛన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: