RAILWAY OFFICERS ATTENDED TO HIGH COURT: విజయవాడ మధురానగర్లోని అప్రోచ్ రోడ్డు, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జాప్యంపై వివరణ ఇచ్చేందుకు రైల్వే ఉన్నతాధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు అరుణ్ కుమార్ జైన్, విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజరు షివేంద్ర మోహన్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ హైకోర్టుకు వచ్చారు. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేశారు.
పనుల పురోగతిపై స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. విజయవాడ మధురానగర్లోని అప్రోచ్ రోడ్డు, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యంతో ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ జవ్వాజి నారాయణ ప్రసాద్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. గత ఆదేశాల మేరకు అధికారులు తాజాగా జరిగిన విచారణకు హాజరయ్యారు.
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ స్పందిస్తూ.. గుత్తేదారు అభ్యర్థన మేరకు ఒప్పంద గడువును పెంచామని తెలిపారు. బకాయిలను సైతం చెల్లించామని వెల్లడించారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పేరు చెప్పి.. రెండున్నర సంవత్సరాల కిందట రైల్వే క్రాసింగ్ను మూసివేశారని పిటిషనర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. స్థానిక కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైల్వే, నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.
కోర్టు జోక్యంతో ప్రస్తుతం అధికారుల్లో చలనం వచ్చిందన్నారు. గుత్తేదారు తరపు సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. తాము పనులను పునఃప్రారంభించేందుకు మున్సిపల్ అధికారులు కొన్ని నిర్మాణాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని కోర్టుకు తెలిపారు. రైల్వే అధికారులు సైతం పనులు కొనసాగించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేశారు. స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చోటు చేసుకుంటున్న లోటుపాట్లు ఉన్నతాధికారులకు తెలియడం లేదని ఈ నేపథ్యంలో రైల్వే అధికారులను కోర్టుకు పిలిపించాల్సి వచ్చిందన్నారు.
ఇదీ జరిగింది: విజయవాడ మధురానగర్లోని అప్రోచ్ రోడ్డు, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యంతో ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ జవ్వాజి నారాయణ ప్రసాద్ వేసిన వ్యాజ్యంపై మార్చి 1న విచారణ చేపట్టిన హైకోర్టు.. ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. పనుల పురోగతిపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిన్న విచారణకు హాజరైన అధికారులు.. తొందరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: