Demand and Consumption of Organic Farming Products : వ్యవసాయంలో పురుగుమందులు, రసాయన ఎరువుల వాడకం పెరిగిపోయిన తరుణంలో సేంద్రియ సాగు, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్న రైతుల సంఖ్య పెరిగింది. ఇలా సాగు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు కొందరు ఆర్గానిక్ పేరుతో మార్కెట్లో విక్రయాలు చేస్తున్నారు. ఇది ప్రజారోగ్యానికి ప్రమాదంగా మారనుంది. అందుకే ఆర్గానిక్ ఉత్పత్తులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే సంస్థను కేంద్ర ప్రభుత్వం గుంటూరులో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఆమోదిస్తే రైతులు పంటను మంచి ధరలకు విక్రయించుకునే వీలుతోపాటు వినియోగదారులకూ నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.
ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. అంకుర సంస్థలతో పాటు కొందరు రైతులు ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో చాలామంది ఈ తరహా ఉత్పత్తులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మార్కెట్లో దొరికేవి నిజంగానే ఆర్గానిక్ ఉత్పత్తులేనా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది.
ఈ విషయాన్ని ధ్రువీకరించే పత్రాలు ఆయా ఉత్పత్తుల ప్యాకింగ్ పై ఉందో లేదో చూసుకోవాలి. కొన్ని ప్రభుత్వ సంస్థలు ఈ తరహా సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తరపున గుంటూరులో రెండేళ్ల క్రితం సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ ఏర్పాటైంది. గతంలో హైదారాబాద్‌లో ఉన్న సంస్థను రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కేటాయించారు. దీంతో కేంద్రప్రభుత్వం గుంటూరులోని లాం ప్రాంగణంలో విత్తన ధ్రువీకరణ సంస్థతో పాటు సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థను ఏర్పాటు చేసింది.
సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ దక్షిణాదిలోని 6 రాష్ట్రాల్లో ఆర్గానిక్ ఉత్పత్తులను పరిశీలించి ధ్రువపత్రాలు ఇస్తోంది. రెండేళ్ల క్రితమే ఈ సంస్థ ఏర్పాటైనా రైతులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. కేవలం 31 రైతు ఉత్పత్తి సంఘాలు మాత్రమే వీరి నుంచి ధృవీకరణ పత్రాలు పొందాయి. ధాన్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు పంట ఏదైనా సరే పరిశీలించి అవి సేంద్రియ విధానంలో చేశారా లేదా అనేది నిర్ధారిస్తారు.
దీని కోసం అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. పంటలను పరిశీలించి అక్కడ సాగు విధానాలు తనిఖీ చేస్తారు. సాగు కోసం ఉపయోగించే వస్తువులను పరిశీలిస్తారు. ఈ క్రమంలో ఆ ఉత్పత్తులను ప్రయోగశాలకు పంపి పరిశీలిస్తారు. వాటివల్ల ఏమీ ప్రమాదం లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే అవి సేంద్రీయ ఉత్పత్తులని ధ్రువీకరణ ఇస్తారు. ఈ సంస్థకు దిల్లీలోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎపెడాతో పాటు ఘజియాబాద్ లోని జాతీయ ఆర్గానిక్, ప్రకృతిసాగు సంస్థ అనుమతులున్నాయి.
రైతులే లక్ష్యం - ఆర్గానిక్ ఎరువుల పేరుతో భారీ మోసం
రాష్ట్రాల నుంచి 40వేలమందికి పైగా రైతులు ఈ సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రైతుల వద్దకు వెళ్లి భూమి దున్నడం నుంచి విత్తనాల ఎంపిక, సాగు విధానాలు, చీడపీడల నివారణ ఇలా అన్ని వ్యవసాయ విధానాలను పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వీరు జారీ చేసే ధృవపత్రానికి గ్యారంటీ ఉంటుంది. సరైన ప్రయోగశాల, సిబ్బంది లేకపోవటం ఈ సంస్థ నిర్వహణకు సవాలుగా మారింది. విత్తన ధ్రువీకరణ సంస్థ, వ్యవసాయశాఖలోని వివిధ విభాగాల నుంచి కొందరు సిబ్బందిని డిప్యుటేషన్ పై తీసుకుని సంస్థను నడిపిస్తున్నారు.
'పూర్తిస్థాయి సిబ్బంది నియామకం జరిగితే సేవలు మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ సంస్థకు పూర్తిస్థాయి ప్రయోగశాల ఇంకా సమకూరలేదు. దానికి 6 సెంట్ల స్థలం కావాల్సి ఉంది. ప్రస్తుతం లాంలో ప్రయోగశాల భవనం నిర్మించారు. అది కేవలం సిబ్బందికి మాత్రమే సరిపోతుంది. ప్రయోగశాల భవనంలో ఉపకరణాలు సమకూర్చుకోవాల్సి ఉంది. వీటన్నింటికి 12కోట్ల మేర అవసరం అవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి వీటికి ఎలాంటి సహకారం అందలేదు. దీంతో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా నిధుల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.' -సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ వినయ్ చంద్
రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న తరుణంలో ఆ ఉత్పత్తులకు అవసరమైన ధ్రువీకరణ కూడా చాలా ముఖ్యం. ఈ సంస్థకు అవసరమైన సహకారం అందిస్తే సేంద్రీయ సాగు చేసే వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ల్యాబ్ లేనందున నమూనాలను కొన్ని పరీక్షల కోసం బెంగళూరు పంపిస్తున్నారు. దీనివల్ల ఫలితాలు రావటం ఆలస్యం అవుతోంది. ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేస్తే ఆలస్యాన్ని నివారించవచ్చు.
"ప్రకృతి సాగు పుడమికి శ్రీరామరక్ష" - మాస్టర్ ట్రైనర్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్న ప్రభుత్వం