Protests Across the State Against RTC Driver Attack: నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల 26వ తేదీన ఆర్టీసీ డ్రైవర్‌పై కొంతమంది దుండగుల దాడి చేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్‌ను పక్కకు తీసుకెళ్లాలని సూచిస్తూ.. ఆర్టీసీ డ్రైవర్ హారన్ కొట్టిన పాపానికి 14 మంది దుండగులు డ్రైవర్‌పై మూకుమ్మడిగా పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్నీ ఆర్టీసీ డిపోల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది.
NMU State President Comments: నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్‌పై జరిగిన అమానుష దాడికి నిరసనగా.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలకు దిగాలని.. ఏపీ పీటీడీ, ఎన్ఎంయూ నేతలు పిలుపునిచ్చారు. ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి మాట్లాడుతూ..''నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై, నిరసన తెలపాలి. డ్రైవర్ బత్తుల రాంసింగ్‌పై విచక్షణారహితంగా, అమానుషంగా దాడి చేయడం దారుణం. ఆర్టీసీ ఉద్యోగులు నిరంతరం ప్రజల మధ్య విధులు నిర్వహిస్తారు. ఏ కారణం లేకుండా విచక్షణారహితంగా, భౌతికంగా దాడి చేసిన వ్యక్తులుపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఆర్టీసీ ఎండీని కోరాం'' అని ఆయన అన్నారు.
Attack On RTC Bus Driver హేయమైన చర్య.. హారన్ కొట్టాడని విచక్షణ రహితంగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..!
SWF State President Comments: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడిని ఏపీఎస్ ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ సంఘం తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన దుండగులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలంటూ విజయవాడలో నేతలు నిరసన తెలిపారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్నీ బస్ డిపోల్లో నల్లబ్యాడ్జీలు ధరించి, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్య మాట్లాడుతూ..''మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్న ప్రజాప్రతినిధి, ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం హేయమైన చర్య. దాడికి పాల్పడిన గూండాలను కఠినంగా శిక్షించాలి. ఇకపై దాడులు జరగకుండా ఉండేలా ప్రభుత్వం కఠిన శిక్షలు విధించాలి'' అని అన్నారు.
RTC EU President Comments: కావలిలో ఆర్టీసి డ్రైవర్లపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించాలని.. ఆర్టీసీ ఈయూ డిమాండ్ చేసింది. దాడిని ఖండిస్తూ.. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోలలో నిరసనల చేపట్టాలని ఆర్టీసీ ఈయూ పిలుపునిచ్చింది. ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై, ధర్నాలు చేయాలని ఈయూ నిర్ణయించిందని.. అధ్యక్షుడు దామోదర్ స్పష్టం చేశారు. దుండగులను అరెస్టు చేయడంలో జాప్యం చేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఆర్టీసీ డ్రైవర్‌పై దుండగుల దాడి.. పరిస్థితి విషమం
National Mazdoor Unity Association President Comments: కావలిలో ఆర్టీసీ డ్రైవర్లపై దాడి చేసిన వైసీపీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని.. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి డిమాండ్ చేశారు. కావలి ప్రాంతంలో డ్రైవర్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు అధికమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.
అసలు ఏం జరిగిందంటే.. ఈనెల 26న నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఆర్టీసీ డ్రైవర్..రోడ్డుకు అడ్డుగా ఉన్న ద్విచక్ర వాహనం తీయాలంటూ హారన్ మోగించాడు. దాంతో దుండగుడు డ్రైవర్‌తో వాదనకు దిగాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని అడ్డుకున్నారు. ఆ తర్వాత దుండగుడు తన మిత్రులతో కలిసి.. కారులో బస్సును వెంబడించాడు. అనంతరం డ్రైవర్‌ను బస్సులోంచి కిందకు దించి, 14 మంది దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. 'ఇక్కడే చంపి పాతిపెడతాం.. ఎవరొస్తారో చూస్తాం' అంటూ దుండగుల హెచ్చరించారు. అంతేకాకుండా, ఆ దారుణ ఘటనను చిత్రీకరిస్తున్న వారి చరవాణులూ లాక్కున్నారు.