Prime Minister Narendra Modi: భారతీయ రైల్వేకు ప్రత్యేక ఆకర్షణగా మారిన వందేభారత్ రైలు సికింద్రాబాద్-విజయవాడ మధ్య పరుగులు పెట్టనుంది. ఈ మేరకు వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. దీంతోపాటు మరికొన్ని రైల్వే ప్రాజెక్టులకూ ప్రధాని శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు వీలుగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. కాజీపేటలో నిర్మించ తలపెట్టిన పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వ్యాగన్ వర్క్‌షాప్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ పనులను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కొద్దిరోజుల క్రితమే ఖరారు చేసింది. ఆ పనులకు ప్రధాని మోదీ శంఖుస్థాపన చేసే అవకాశం ఉంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు సంబంధించిన రూ.700 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు ఇటీవలే ఖరారయ్యాయి. ఈ పనులు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేలా రైల్వే శాఖ ఆలోచన చేస్తుంది. సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ రెండో లైన్ పనులు పూర్తయినందున ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. వందేభారత్ రైలుతో పాటు ఈ మూడు పనులకూ రైల్వే శాఖ శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. వీటి ప్రారంభం తర్వాత మోదీ బహిరంగ సభ కూడా ఉంటుందని భాజపా నేతలు భావిస్తున్నారు. సభకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి..