SANKALP SIDDHI SCAM UPDATES : విజయవాడలో కలకలం రేపిన సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసం కేసు దర్యాప్తు కొలిక్కి రావడం లేదు. కీలక నిందితుడు గుత్తా కిరణ్ కోసం మూడు నెలల నుంచి గాలిస్తున్నా ఇంత వరకు దొరకలేదు. కుంభకోణం విలువ, డిపాజిటర్ల సంఖ్య, వసూలు చేసిన మొత్తంపై ఇంకా స్పష్టత రాలేదు. రికార్డులు పక్కాగా లేకపోవడం పోలీసులకు సవాలుగా మారింది.
సంచలనం సృష్టించిన సంకల్పసిద్ధి స్కాంలో పోలీసుల దర్యాప్తు సాగుతూ ఉంది. కీలక నిందితుడు కిరణ్ ఆచూకీ దొరక్క విచారణ పూర్తికావడం లేదు. బ్యాంకింగ్, సైబర్ నిపుణులతో పరిశీలన చేయిస్తున్నా ఫలితం శూన్యం. వెబ్‌సైట్‌లోని వివరాలు అరకొరగానే ఉండటం... ఒకే పేరుతో పలు ఐడీలు ఉండడంతో అసలు విషయాలు తేలడం లేదు. 17 బ్యాంకు ఖాతాల ద్వారా అధికశాతం లావాదేవీలు జరిగినట్లు తేలింది.
డిపాజిటర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా కేవలం రెఫరల్ పాయింట్లనే చూపిస్తూ నిర్వాహకులు వల వేశారు. వీటిని ఇతరులకు కూడా బదిలీ చేసే వెసులుబాటు కల్పించారు. నిందితులు, కీలక ఏజెంట్లు వెబ్‌సైట్‌లో బంధువుల పేర్లు పెట్టి లాగిన్ ఐడీలు రూపొందించారు. ఎక్కువ మందిని చేర్చిన వారికి మొబైల్, ట్యాబ్‌లు ఇస్తామని ఆశ చూపడంతో చాలామంది పోటీపడి మరీ తెలిసిన వారిని చేర్పించారు. ఇలా డిపాజిటర్ల సంఖ్యను 45 వేలకు పెంచుకున్నట్లు అంచనా.
ఈ కేసులో మొత్తం 54 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటివరకు 32మందిని అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. పలువురిని కస్టడీకి తీసుకుని విచారించారు. ఆంధ్ర, తెలంగాణలో 15 మంది కోర్ కమిటీ ఏజెంట్లను గుర్తించి అరెస్టు చేశారు. నగదు, బంగారం, వెండి, స్థిర, చరాస్తులు మొత్తం 40 కోట్ల వరకు విజయవాడ సీసీఎస్ పోలీసులు రికవరీ చేశారు. ఇందులో కీలక నిందితుడు కిరణ్ కోసం పోలీసు బృందాలు ఇంకా గాలిస్తునే ఉన్నాయి.
మూడు నెలలుగా బెంగళూరు, బళ్లారి, అనంతపురంలో ఐదు టీమ్‌లను పెట్టి జల్లెడ పడుతున్నా లాభం లేదు. నిందితుడు సిమ్ వాడకపోవడంతో బంధువుల ఫోన్లపైనా నిఘా పెట్టినా ఫలితం లేదు. 2021 నవంబరులో ప్రారంభమైన సంకల్ప సిద్ధి.. గతేడాది వరకు కేవలం సరకుల స్కీమ్‌పైనే నడిచింది. 2022 ఏప్రిల్ నుంచి వ్యాపారం వృద్ధి చెందడంతో బళ్లారిలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సోదరుడు కిరణ్‌కు నిర్వాహకుడు బాధ్యతలు అప్పగించారు.
మరిన్ని స్కీమ్‌లను ప్రవేశపెట్టడంతో జులై నుంచి సెప్టెంబరు వరకు అనూహ్య రీతిలో విస్తరించింది. వ్యాపార లావాదేవీలు, ఖాతాల వివరాలు, ఇలా అనేక అంశాలు పూర్తిగా కిరణ్ పర్యవేక్షించే వారు. దీంతో పూర్తి సమాచారం ఆయన వద్దే ఉంది. అతను చిక్కితేగాని కేసు కొలిక్కి వచ్చేలా కన్పించడంలేదని పోలీసులు అంటున్నారు.
ఇవీ చదవండి: