Opposition leaders fired on YCP govt: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ), కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు వ్యవహరిస్తున్న తీరుపై అఖిలపక్షం నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ.. నేడు విశాఖలో అఖిలపక్షం నేతలు చర్చాగోష్ఠి నిర్వహించారు. చర్చాగోష్ఠిలో తెలుగుదేశం నేతలు బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు, సీపీఎం నాయకులు జగ్గు నాయుడు, ఏపీ మహిళా సమాఖ్య విశాఖ జిల్లా అధ్యక్షురాలు విమల సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచారని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వైసీపీ సర్కారు.. అదే అంచనా మొత్తానికి అంగీకారం తెలపాలని కోరడంపై నాయకులు విమర్శలు గుప్పించారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం దారుణమని ప్రతిపక్షాల నాయకులు విమర్శించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పిచడంలో వైసీపీ ప్రభుత్వ విఫలమయ్యిందని ఆక్షేపించారు. తెలుగుదేశం హయాంలో పోలవరం పనులు శరవేగంగా జరిగితే.. వైసీపీ పాలనలో నత్తనడకన సాగుతున్నయని నేతలు ఎద్దేవా చేశారు. విజయవాడలోని లెనెన్ సెంటర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైసీపీ, బీజేపీ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. పోలీసులను అడ్డుపెట్టుకొని.. పోలవరం నిర్మాణ పనులు పరిశీలనకు వెళ్లే ప్రతిపక్ష పార్టీల నేతలకు అనుమతించకపోవడం అన్యాయమని దుయ్యబట్టారు.
అనంతరం పోలవరం ప్రోజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సాగు, తాగునీరు అందించవచ్చని ప్రతిపక్షాల నేతలు వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి, పోలవరం నిర్మాణానికి నిధులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్‌కి కేసుల భయం పట్టుకుందన్నారు. అందుకే భాజపాని నిలదీయడం లేదని విమర్శించారు. పోలవరం నిర్మాణం కోసం సర్వం కోలిపోయిన నిర్వాసితులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంతో పోట్లాడి.. పోలవరం నిర్మాణానికి నిధులు తీసుకురావాలని కోరారు. నిర్వసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించడంతో పాటు అన్నిరకాల మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షపార్టీల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి.. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవీ చదవండి