Negligence on VMC New Building Construction: విజయవాడ నగరపాలక సంస్థ (Vijayawada Municipal Corporation) నూతన పరిపాలన భవనం పనులు ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. సుమారు 30 కోట్ల రూపాయలతో అంచనాలతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భవనం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. పార్కింగ్ స్థలంతో పాటు నాలుగు అంతస్థుల వరకు పిల్లర్లు నిర్మించింది. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయినా నేటికీ నూతన పరిపాలన భవనం పనులు పూర్తి చేయలేదు. నూతన పరిపాలన భవనం ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పడం లేదు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పాత భవనం ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల అవసరాలకు సరిపోవడం లేదని ప్రతిపక్ష కార్పొరేటర్లు చెబుతున్నారు.
సుమారు 30 కోట్ల రూపాయలతో ఏడు అంతస్థుల్లో నిర్మించతలపెట్టిన నూతన భవనం ఏళ్లు గడుస్తున్నా నాలుగు అంతస్థులు పిల్లర్లకు మాత్రమే పరిమితమయ్యింది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన పరిపాలన భవనం నేటికీ పూర్తికాకపోవడంపై ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు మండిపడుతున్నారు. గతంలో నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారుకు బిల్లులు సకాలంలో చెల్లించకుండా ఇబ్బంది పెట్టారని చెబుతున్నారు.
వైసీపీ అనుకూల గుత్తేదారులకు రివర్స్ టెండరింగ్ పేరుతో కట్టబెట్టాలని అధికార పక్షం చూస్తోందని అని ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ప్రతీ దానిలో వైసీపీ నాయకులు వాటాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. గుత్తేదారులకు చెల్లించాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
"విజయవాడ నగరపాలక సంస్థ భవన నిర్మాణ పనులు పదేళ్ల కిందట ప్రారంభించారు. ఇప్పటికీ పిల్లర్లే ఉన్నాయి కానీ భవన నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత.. రివర్స్ టెండరింగ్ అనుసరించడం ద్వారా సంవత్సరాల తరబడి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజాధనం దుర్వినియోగం ఎలా చేయాలో అన్నది.. ఈ భవన నిర్మాణాన్ని చూస్తే తెలుస్తుంది. ప్రతి సంవత్సరం అంచనాలను పెంచుకుంటూ పోతున్నారు. పాలకులు, అధికారులు సకాలంలో నిర్మించి ఉంటే.. ప్రజాధనం దుర్వినియోగం అయ్యేది కాదు". - సత్తిబాబు, సీపీఎం, వీఎంసీ ఫ్లోర్ లీడర్
"ఈ భవనం 2015లో ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారు. కార్పొరేషన్‌కు ఆదాయం రావాలని 32 కోట్లతో దీని నిర్మాణాన్ని తలపెట్టారు. దీనికి నాలుగు ఫ్లోర్ల నిర్మాణం కూడా జరిగింది. ఈ లోపు అధికారం మారడంతో ఈ నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. ఇది పూర్తై ఉంటే కార్పొరేషన్‌కు భారీగా నిధులు వచ్చేవి. ఈ ప్రభుత్వ ఆదాయ వనరులపై దృష్టి పెట్టడం లేదు. ఇందులో పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారింది". - బాలస్వామి, టీడీపీ, విఎంసీ ఫ్లోర్ లీడర్