Nara Lokesh Yuvagalam 200 Days: జనస్వరమై కదులుతున్న నారా లోకేశ్ యువగళం 200వ రోజు మైలురాయిని చేరుకుంది. నవశకం కోసం ఈ యువగళం అంటూ జనవరి 27న ప్రారంభించిన పాదయాత్ర మొత్తం 77 నియోజకవర్గాల్లో 2710 కి.మీ.లు మేర సాగిన చారిత్రాత్మక ఘట్టానికి పోలవరం (Polavaram)వేదికైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పశ్చిమ గోదావరి వరకూ అధికార పార్టీ అడుగడుగునా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ వచ్చినా.. ఉక్కు సంకల్పంతో ముందుకే కదం తొక్కుతూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. 400రోజుల పాటు 4వేల కిలోమీటర్ల లక్ష్యం నిర్దేశించుకున్న పాదయాత్ర నవగళమై గర్జిస్తూ.. అలుపెరుగని అడుగులు శరవేగంగా లక్ష్యం దిశగా సాగుతున్నాయి.
కదిలే యువగళం నవ్యాంధ్ర జనహితం అంటూ.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర జన ప్రభంజనాన్ని తలపిస్తూ దూసుకెళ్తోంది. నవ్యాంధ్ర ప్రజావాహినిలో ప్రతీ వర్గం సమస్యల్ని వింటూ జన ప్రగతి కోసం అంటూ సాగుతున్న ఈ యాత్ర పోలవరం నియోజకవర్గంలో 200వరోజు జరుపుకోనుంది. కుప్పం శ్రీవరదరాజస్వామి (Srivaradarajaswamy) పాదాల చెంత జనవరి 27న ప్రారంభమైన యువగళం... 400 రోజుల్లో 4వేల కి.మీ.లు చేరుకోవాలని తొలుత నిర్ణయించింది. నిర్దేశిత లక్ష్యానికంటే ముందుగానే రోజుకు 13.5 కి.మీ.ల పాదయాత్ర చేస్తూ దూసుకుపోతు 200రోజుల్లోనే 2710 కి.మీ.లను అధిగమించింది. ఎండనకా, వాననకా పట్టువదలని విక్రమార్కుడిలా సాగుతున్న యువనేత లోకేశ్‌కు ప్రాంతాలతో సంబంధం లేకుండా జనం బ్రహ్మరథం పడుతున్నారు. అభిమానుల తాకిడితో చేతులకు గాయాలైనా, భుజం నొప్పి బాధిస్తున్నా అనివార్యమైన సందర్భాల్లో మినహా ఇప్పటివరకు విశ్రాంతి కోసమని ఏ ఒక్కరోజూ యాత్రకు విరామం ప్రకటించలేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లక్షలాది ప్రజలు యువగళంలో భాగస్వాములై తమ గొంతుకను వినిపిస్తున్నారు. జనంతో మమేకమవుతూ, సమస్యలను ఓపిగ్గా వింటూ... నేనున్నాననే భరోసా ఇస్తూ ముందుకు సాగుతోంది.
గడచిన 200రోజుల్లో దాదాపు 4వేల వినతులు అందగా.. లక్షలాది మంది నేరుగా కలుసుకుని సమస్యలు విన్నవించుకున్నారు. మొత్తం 200రోజుల పాదయాత్ర 77 అసెంబ్లీ నియోజకవర్గాలు, 185 మండలాలు, మున్సిపాలిటీలు, 1675 గ్రామాల మీదుగా సాగింది. ఇప్పటివరకు 64 బహిరంగసభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని వివిధవర్గాల సమస్యలు తెలుసుకున్నారు. దారి పొడవునా జనం యువనేతకు నీరాజనాలు పడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతున్నారు. రాజకీయ చైతన్యానికి కేంద్రమైన విజయవాడలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తెల్లవారుజామున 3.30వరకు ముఖ్యంగా మహిళలు యువనేత కోసం రోడ్లపై ఎదురుచూడటం విశేషం. సెల్ఫీ విత్ లోకేశ్ (Selfie with Lokesh) కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి రోజూ ఉదయం 8గంటలకే 2వేలమంది వరకు అభిమానులు బస కేంద్రం వద్దకు చేరుకుంటున్నారు. యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలో 108 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుపార్టీ విజయదుందుబి మోగించింది.
రాయలసీమలో గతంలో మరే నాయకుడు చేయని విధంగా 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల్లో 1587 కి.మీ. పాదయాత్ర చేసిన చేసిన లోకేశ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. యువగళం పాదయాత్రకు ఆది నుంచీ తాజా గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల వరకూ అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారితో సహా 46మంది కీలకనాయకులపై తప్పుడు కేసులు పెట్టడం అధికారపార్టీలో నెలకొన్న భయానికి అద్దంపడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువనేత ప్రచారరథం మొదలు నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. కుప్పంలో తొలి అడుగు నుంచీ లోకేష్ పై 3కేసులు నమోదు చేశారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్‌తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. యువగళాన్ని స్వాగతిస్తూ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం, పసుపు సైనికులు (Yellow soldiers) తిరగబడితే పారిపోవడం వంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎండగడుతూ... ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తూ యువగళం ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చాక తాము ఏంచేస్తామో స్పష్టంగా చెప్తూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది.
పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలపై యువనేత లోకేశ్ లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటివరకు 132 సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో ఆయావర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొన్నారు. అధికారంలోకి వచ్చాక తాము ఏం చేయబోతున్నారో స్పష్టం చేస్తున్నారు. రైతులు, యువత, మహిళలు, ముస్లింలు, బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, వ్యాపారులు, ఐటి ప్రొఫెషనల్స్, భవన నిర్మాణకార్మికులు, న్యాయవాదులు, రవాణారంగ ప్రతినిధులు తదితర వర్గాలతో యువనేత సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో వివిధ కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న విషయాన్ని గమనించిన లోకేశ్.. అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో జాబ్ నోటిఫికేషన్, ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ (Annual Job Calendar), పరిశ్రమల ఏర్పాటుద్వారా యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీలతో యువతకు భరోసా ఇస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్లు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మొబైల్ ఫోన్లకే శాశ్వత కులధృవీకరణ పత్రాలు పంపిస్తామని హామీ ఇచ్చారు. బిసిల రక్షణకు ఎస్సీ, ఎస్టీ తరహా చట్టం, ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్, వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు, చేనేతలు, రజక వృత్తి పనివారికి ఉచిత విద్యుత్ వంటి హామీలు ఆయా వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
యువగళం సందర్భంగా ప్రతిజిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు మరే ఇతర జిల్లాల్లో లేనివిధంగా గుంటూరు జిల్లాలో 3చోట్ల యువనేత లోకేశ్ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొత్తం ఇప్పటివరకు నిర్వహించిన 10 ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజలనుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. మొత్తం 15 కమిటీలు సమన్వయం చేసుకుంటూ యువగళానికి ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించి ముందుకు వెళ్లటంలో కీలకంగా పని చేస్తున్నాయి. పాదయాత్ర 200రోజుల సందర్భంగా ప్రతీ నియోజకవర్గంలో మద్దతు ర్యాలీలు నిర్వహించాలని పార్టీ అధిష్టాననం శ్రేణుల్ని ఆదేశించింది. ఇందుకనుగుణంగా 3కి.మీ మేర ఇన్ఛార్జులు యువగళానికి సంఘీ భావంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. రోజుకు సగటున 10కి.మీ అనుకున్న పాదయాత్ర ఇప్పుడు 13.5కిలోమీటర్ల మేర సాగుతోంది. పలు సందర్భాల్లో రోజుకు 23కిలోమీటర్ల మేర కూడా లోకేశ్ నడుస్తున్నారు. రానున్న రోజుల్లో సగటు ప్రయాణాన్ని మరి కాస్త పెంచి నవంబరు నాటికే తన యాత్రను పూర్తి చేసే ప్రయత్నాల్లో లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహ రచనపై దృష్టిపెట్టే నిమిత్తం తన యాత్రను త్వరగా పూర్తి చేస్తున్నారని సమాచారం. అందుకే ఆయన నడక వేగం పెంచారు. ఇక ముందు జరగాల్సిన పాదయాత్రలో 45 రోజులు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో, మరో 45 రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన పర్యటించనున్నట్లు తెలుస్తోంది.