Nara Lokesh on Dalit Attacks, VJA Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని నెలలుగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రోద్బలంతోనే దళితులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వ అండదండలతో దళితులపై జరుగుతున్న వరుస దాడులపై కేంద్ర ప్రభుత్వం, మానవ హక్కుల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Lokesh Fire on YSRCP Govt: రాష్ట్రంలో దళితులపై వరుసగా జరుగుతున్న దాడులపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులకు పాల్పడుతున్నా అరాచక శక్తులపై చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం అలసత్వం వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురానికి చెందిన దళితుడైన నిప్పుల కోటేశ్వరరావు కుటుంబంపై వైసీసీకీ చెందిన ముత్తారెడ్డి తీవ్రంగా అవమానించి, దాడికి పాల్పడటం దారుణమన్నారు. కులం పేరుతో ముత్తారెడ్డి తనను దూషించాడని బాధితుడు కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అరాచక పాలనకు నిదర్శనమని లోకేశ్ దుయ్యబట్టారు.
Lokesh on Kanchikacharla Incident: అనంతరం బాధిత కుటుంబానికి వైద్యం అందించేందుకు సైతం నందిగామ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిరాకరించడాన్ని గమనిస్తే.. జగన్ ప్రభుత్వ అండదండలతోనే దళితులపై దమనకాండ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కంచికచర్లలో దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్‌పై మూత్రం పోసి అవమానించి, చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో బాధ్యులపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడాన్ని పరిశీలిస్తే.. దళితులపై జరుగుతున్నవన్నీ ప్రభుత్వ ప్రాయోజిత దాడులేనని స్పష్టంగా అర్ధమవుతుందని మండిపడ్డారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం, జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని.. దళితులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్ జమానాలో మరో దళిత బిడ్డకు ఘోర అవమానం: లోకేశ్
Lokesh on VJA Bus Accident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో జరిగిన ప్రమాదంపై నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. బస్టాండ్‌లో ప్రమాదం జరగడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సులతోనే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని లోకేశ్ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క బస్సు కూడా కొనలేదని ఆగ్రహించారు. ఆర్టీసీలో పరికరాల కొనుగోలుకు జగన్ ప్రభుత్వం నిధులే ఇవ్వట్లేదని నారా లోకేశ్ విమర్శించారు.
''విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం చాలా బాధాకరం. ప్లాట్‌ఫాంపైకి బస్సు దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. దీనికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. నాలుగున్నరేళ్లుగా ఆర్టీసీ గ్యారేజిల్లో నట్లు, బోల్టుల కొనడానికి కూడా ప్రభుత్వం నిధులివ్వడం లేదు. రిక్రూట్‌మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.'' - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి