Nara Bhuvaneshwari, Lokesh Fire on Punganur Incident: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్త శ్రీకాకుళం వాసులను చొక్కాలిప్పించిన ఘటనపై.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌లు ఘాటుగా స్పందించారు. పుంగనూరులో జరిగిన ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనమని అభివర్ణించారు. ఈ రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా..? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
అసలు ఏం జరిగిందంటే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. అక్టోబరు 2వ తేదీన రణస్థలం నుంచి కుప్పానికి సైకిల్ యాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద టీ తాగడానికి సైకిళ్లు ఆపారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్త సూరి, మరికొందరితో అక్కడికి వచ్చి.. 'ఇది మంత్రి పెద్దిరెడ్డి అడ్డా.. టీడీపీ జెండాలతో మీరెలా వస్తార్రా' అంటూ రెచ్చిపోయారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు ధరించిన పసుపు చొక్కాలను విప్పించి, టీడీపీ జెండాలు, కండువాలను తీసేయించి.. పుంగనూరు నుంచి పంపించేశారు.
Clash Between Janasena, YSRCP Activists: అవనిగడ్డలో జనసేన నేతలపై వైసీపీ నేతలు దాడి..ఉద్రిక్తత
Bhubaneswari Condemned Punganur Incident: ఈ నేపథ్యంలో పుంగనూరు ఘటనను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తీవ్రంగా ఖండించారు. ''పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనం. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనం. బిహార్‌లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవు. పేదలపై పెత్తందారీ పోకడలు అంటే ఇవే. తెలుగుదేశం అంటే ఒక కుటుంబం. తమ నేతను అక్రమంగా జైలులో పెట్టారని నిరసన కూడా చేయకూడదా..?, కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా..?, సామాన్యులకు మీరు చేసిన అవమానం ప్రజలంతా గమనించారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే.'' అని ఆమె అన్నారు.
Lokesh Fire on YCP Government: శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేపట్టిన తెలుగుదేశం కార్యకర్తల చొక్కాలు విప్పించి దాడికి పాల్పడటంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమేనా..? అని నిలదీశారు. పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి.. టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా..? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో.. వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.