MRPS Leaders Round Table Meeting In Vijayawada : దళితులంతా కలిసి ఓట్లు వేస్తేనే జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారని, కానీ మాలలకు ప్రాధాన్యత ఇచ్చి, మాదిగలను తొక్కేస్తున్నారని ఎమ్ఆర్పీఎస్ నేతలు అన్నారు. విజయవాడలో శుక్రవారం దళిత, గిరిజన సంఘాల రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల మధ్య గొడవలు పెట్టేందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు మండిపడ్డారు. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన రావటం లేదని, ప్రభుత్వ పెద్దల్లో మార్పు రావడం లేదని, తీరు మారకపోతే వచ్చే ఎన్నికలల్లో బుద్ది చెబుతామని హెచ్చరించారు.
విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సమాంతరంగా బాబూ జగజ్జీవన్ రాం విగ్రహాన్ని కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. బాబూ జగజ్జీవన్ రాం విగ్రహం కూడా ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తీర్మానం చేశారు. జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సమయంలో దళితులంతా కలిసి ఓట్లు వేస్తేనే సీఎం అయ్యారని, కానీ మాలలకు ప్రాధాన్యత ఇచ్చి, మాదిగలను తొక్కేస్తున్నారంటూ ఎమ్ఆర్పీఎస్ నేతలు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దళిత, గిరిజనులను మోసం చేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం శుభ పరిణామమని, అయితే ఆ రోజుల్లో దళిత జాతి బిడ్డగా, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడంలో బాబూ జగజ్జీవన్ రాం కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. జగన్ అందరి ఓట్లతో గెలిచారనేది గుర్తుంచుకోవాలని, ఒక్క విగ్రహం ఏర్పాటు ద్వారా దళితుల్లో అంతరాలు సృష్టించవద్దని హితవు పలికారు. ప్రభుత్వం స్పందించకుంటే జగజ్జీవన్ రాం జయంతి ఏప్రిల్ 5న ఆమరణ దీక్ష చేస్తామని, వచ్చే ఎన్నికలలో తమ సత్తా చూపిస్తామని ఎమ్ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
" జగజ్జీవన్ రాం, అంబేడ్కర్ అంటే మా దళిత, గిరిజన జాతులకు రెండు కళ్లుగా భావిస్తున్నాం. ఈ రెండు కళ్లు , రెండు విగ్రహాలు ఒక చోట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇద్దరు సమకాలిన నాయకులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల రాజకీయం కోసం ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహంతో జగజ్జీవన్ రాం విగ్రహం పెట్టకుండా, రెండు విగ్రహాలు ఒకచోట లేకపోవడం వల్ల సంతోషంగా ఉండరు. జగన్ మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి రావడానికి కారణం ఎస్సీ, ఎస్టీలు వేసినే ఓట్లే ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్ 14 నాటికి జగజ్జీవన్ రాం గారి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. " - వెంకటేశ్వరరావు, ఎమ్ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు
ఇవీ చదవండి