Civil Supplies Minister Karumuri Nageswara Rao: రేషన్ కార్డు కల్గిన పేదలకు చౌక బియ్యంతో పాటు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. తొలుత ప్రయోగాత్మకంగా... రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నలను పంపిణీ చేసి దశలవారీగా రాష్ట్రమంతా పింపిణీ చేస్తామన్నారు. రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు తీసుకునే విషయమై వాలంటీర్లతో సర్వే చేశామని మంత్రి తెలిపారు. రేషన్ కార్డుదారులందరూ కావాలని కోరినట్లు తెలిపారు. కందిపప్పు బాగోలేదని చాలా మంది ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. బండి వద్దే కందిపప్పును ఉడకబెట్టి నాణ్యత పరిశీలించాలని ఆదేశించినట్లు తెలిపారు. నాసిరకం పప్పును సరఫరా చేసిన వారిపై విచారణ కొనసాగుతోందని మంత్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు. లోపాలు ఉంటే.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.
90శాతం చెల్లింపులు: గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం సేకరిస్తున్నామన్న మంత్రి.. రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 90శాతం చెల్లింపులు చేశామని, 21 రోజుల్లోపే ధాన్యం సేకరణ కు సంబంధించి సొమ్ములు చెల్లిస్తున్నామన్నారు. సీఎం జగన్ రైతులకు పెద్దపీట వేసి పెద్దఎత్తున మేలు చేస్తుంటే.. వెంట్రుక వాసి లోపాలను పెద్దవిగా చేసి చూపవద్దని కోరారు. ధాన్యం సేకరణలో అక్కడక్కడ రైస్ మిల్లర్ల వల్ల సమస్యలు వచ్చాయని, ఇప్పటికే మూడు రైస్ మిల్లులను సీజ్ చేశామన్నారు. అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజనూ సేకరిస్తున్నామన్న మంత్రి.. రంగుమారిన ధాన్యాన్ని మార్చి 15 లోపు కొనాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రూ. 900 కోట్ల వరకు బకాయిలు: రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేయడం వెనుక కొంతమంది దళారులు ప్రోత్సాహం ఉందని మంత్రి తెలిపారు. దళారులే ఆందోళన చేయించినట్లు ఇంటలిజెన్స్ నివేదికలు వచ్చాయన్నారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ. 900 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని నాగేశ్వరరావు ే పేర్కొన్నారు. మిల్లర్ల పాత బకాయిలన్నింటినీ ఈ ఏడాదిలో చెల్లిస్తామన్నారు. ఇంటింటికీ రేషన్ ఇచ్చే ఎంటీయూ బండ్లవారికి ఇన్సురెన్స్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 9250 ఎంటీయూ బండ్లన్నీ పనిచేస్తూనే ఉన్నాయని, ఇప్పటివరకు ఏ బండీ ఆగలేదని మంత్రి వెల్లడించారు.
ఇవీ చదవండి: