Michaung cyclone in Vijayawada : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 11 డివిజన్లు కొండ ప్రాంతంలో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. రెండ్రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు కొండ ప్రాంతాల్లో దెబ్బతిన్న రిటైనింగ్ వాల్ చెట్లు కూలి దెబ్బతిన్న ఇళ్లను జనసేన, సీపీఎం నాయకుల పరిశీలించారు. వరదల సమయంలో కొండ ప్రాంత ప్రజలు భయాందోళనలతో జీవించాల్సి వస్తోందన్నారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తుపాను బీభత్సం - బిక్కుబిక్కుమంటున్న అన్నదాతలు
Michaung cyclone affected districts in AP : తుపాను ప్రభావానికి విజయవాడలోని బీఎస్ఎన్ఎల్ (BSNL) ఉద్యోగుల నివాస గృహంలోని చెట్లు విరిగిపడ్డాయి. మంగళవారం సాయంత్రం తీవ్రమైన గాలులతో భారీగా వర్షం కురవటంతో ఏళ్లనాటి చెట్లు వేళ్లతో సహా నేలకొరిగాయి. చెట్లు పడిపోవటంతో సముదాయంలోని ఫర్నిచర్, ఇతర సామగ్రి దెబ్బతిన్నాయని ఉద్యోగులు తెలిపారు.
Michaung cyclone in NTR District : ఎన్టీఆర్ జిల్లాలో వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ నుంచి చేరుతున్న వరద ప్రవాహంతో కట్లేరు, పడమటి, ఎదుళ్ల, విప్ల, గుర్రపు, కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం - విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం పల్లంపల్లి -దాములూరు గ్రామాల మధ్యలో లెవెల్ కాజ్వే మీదుగా వరద ప్రవహిస్తోంది. వీర్లపాడు- నందిగామ మండలాల మధ్య రాకపోకల నిలిచిపోయాయి. తిరువూరు నియోజకవర్గంలో కోతకు వచ్చిన వరి నేలకు ఒరిగింది. విస్సన్నపేట మండలం కొర్లమండ గ్రామంలో భారీగా పంటపొలాల్లో చేరిన వర్షపు నీటికి వరిపంట మునిగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు కన్నీళ్లు మిగిల్చి తీరం దాటిన తుపాన్ - కోస్తాంధ్ర కకావికలం
Michaung cyclone in Nandigama : నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో తుపాను ప్రభావంతో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. రెండ్రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో మిర్చిమొక్కలు నేల వాలాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట పూత, కాపు, కాయ దశలో దెబ్బతిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనాసాగరం, ఐతవరం కంచెల తదితర గ్రామాలతో పాటు చందర్లపాడు, కంచికచర్ల మండలాల్లోనూ వరి పంట నీట మునిగింది. పంట చేతికి వచ్చే సమయంలో నీటమునిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Michaung cyclone in AP : పెనుగంచిప్రోలు మండలంలోని కూచి వాగుకు వరద పోటెత్తింది. పెనుగంచిప్రోలు, ముచ్చింతాల, అనిగండ్లపాడు, గుమ్మడిదూరు గ్రామాల్లోని వరి పంటను పూర్తిగా నీట ముంచింది. ధాన్యం బస్తాలను కాపాడుకునేందుకు వరద నీటిలో రైతులు అవస్థలు పడుతున్నారు.