Lokesh Yuvagalam Padayatra in Vijayawada: నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విజయవాడలో జనం పోటెత్తారు. పెద్దఎత్తున తరలివచ్చిన పసుపదళంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. లోకేశ్‌కు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. నగర వీధులన్నీ పసుపుమయంగా మారిపోయాయి. కోలాటా నృత్యాలు.. భారీ గజమాలలతో ఘనస్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజలు సమస్యలపై లోకేశ్‌కు వినతిపత్రాలు అందజేశారు.
విజయవాడలో లోకేశ్ యువగళం పాదయాత్రకు అపూర్వ ఆదరణ లభించింది. ప్రకాశం బ్యారేజీతోపాటు పైవంతెనలు, రోడ్లకు ఇరువైపులా, భవనాల పైనుంచి లోకేశ్ పాదయాత్రకు జనం మద్దతు తెలిపారు. కేవలం 10 కిలోమీటర్ల పాదయాత్రకు దాదాపు 6 గంటలకు పైగా సమయం పట్టింది. ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలంతా లోకేశ్‌తో పాటు అడుగులు వేశారు.
వైసీపీ ప్రభుత్వ అక్రమాలను, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వ్యాపార ప్రముఖలపై దాడులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని నారాలోకేశ్ ధ్వజమెత్తారు. అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల వ్యాపారాలు దివాల స్థితికి చేరాయని లోకేష్ ఆరోపించారు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జే ట్యాక్స్ విధానాల వల్ల వ్యాపారాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ కంటే.. జగనోరా వైరస్ అత్యంత దారుణంగా పీడిస్తోందని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారాలు స్వేచ్ఛగా పారదర్శకంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తామని హమీ ఇచ్చారు. అనవసరమైన పన్నుల భారాన్ని తగ్గిస్తామని, చిరువ్యాపారులకు ప్రోత్సహకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ముస్లింల ఆస్తులు, ఓటు బ్యాంకుపైనే వైసీపీ ప్రభుత్వానికి ఆసక్తి ఉందని లోకేశ్ ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్య సామాజిక వర్గీయులు కలిసి వినతి పత్రం అందించారు. టీడీపీ పాలనలో ఉన్న గౌరవం ఇప్పుడు లేదని వాపోయారు. ఆర్యవైశ్యుల సంఘం, కాళేశ్వరరావు మార్కెట్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ముఠా వర్క్‌ర్లు లోకేశ్‌ను కలిసి సమస్యలను విన్నవించారు.
విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఎలక్ట్రికల్ వర్క్‌ర్ల సంఘం నాయకులు ప్రతినిధులు కలిసి వినతిపత్రాలు అందించారు. ఆటోవర్కర్ల ప్రతినిదుల కలిశారు. వారికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. చంద్రన్న బీమా అమలు చేస్తామని చెప్పారు. అంతకుముందు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన లోకేశ్.. కుల్చివేసిన ప్రజావేదిక, టీడీపీ ప్రభుత్వ హయంలో నిర్మించిన కొండవీటి వాగుల వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
Yuvagalam Padayatra Enters into Vijaywada: విజయవాడలోకి యువగళం పాదయాత్ర.. ప్రకాశం బ్యారేజీ పసుపుమయం
తాడేపల్లి సీతానగరం వద్ద 2,500 కిలోమీటర్లు మైలు రాయి చేరుకున్న సందర్భంగా మంగళగిరి ప్రజలకు 20 వేల ఇళ్ల నిర్మాణానికి హామీ ఇస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 189వ రోజు అయిన నేడు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. పెనలూరు నియోజకవర్గం మీదుగా సాయంత్రానికి గన్నవరం నియోజకవర్గంలోకి చేరుకోనున్నారు. రాత్రికి నిడమానూరు శివారు ప్రాంతంలో లోకేశ్ బస చేయనున్నారు.
Hello Lokesh Program with Students And Youth: టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్: లోకేశ్