Leela Ramakrishna Prasad Trust Case updates: కానూరుకు చెందిన ముప్పవరపు చౌదరి అండ్ లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టు భూముల రక్షణ కోసం పోరాడుతున్న తనపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారంటూ.. ప్రవాస భారతీయుడు కుదరవల్లి శ్రీనివాసరావు వేసిన పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) విచారణ జరిపింది. విచారణలో భాగంగా పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పిటిషనర్‌పై తొందరపాటు చర్యలొద్దు.. ముప్పవరపు చౌదరి అండ్ లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టు భూముల కోసం పోరాడుతున్న తనపై.. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ప్రవాస భారతీయుడు కుదరవల్లి శ్రీనివాసరావు తాజాగా హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌లో..తనపై పెనమలూరు పోలీసులు పెట్టిన కేసులను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ట్రస్ట్ భూముల రక్షణ కోసం పోరాడుతున్న ఎన్‌ఆర్‌ఐ కుదరవల్లి శ్రీనివాసరావుపై పెనమలూరు పోలీసులు తప్పుడు కేసు పెట్టారని తెలిపారు. శ్రీనివాసరావును, ఆయన కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టారని ధర్మాసనానికి వివరించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం విచారణ జరిపించి.. పిటిషనర్ కుదరవల్లి శ్రీనివాసరావుపై నమోదు అయిన కేసును కొట్టి వేయాలని న్యాయస్థానాన్ని కోరారు. న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు ఆదేశించింది. అవసరమైతే 41ఏ నోటీసులు ఇచ్చి, పిటిషనర్‌ను విచారించాలని తెలుపుతూ.. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఎన్‌ఆర్‌ఐ కుదరవల్లి శ్రీనివాసరావుపై కేసు నమోదు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని ముప్పవరపు చౌదరి, లీలా కృష్ణ ప్రసాద్ ట్రస్టు భూముల రక్షణ కోసం ప్రవాసాంధ్రుడు కుదరవల్లి శ్రీనివాసరావు పోరాడుతున్నారు. ఇటీవలే ట్రస్టు భూములను ఖాళీ చేయాలంటూ శ్రీనివాసరావు తమను బెదిరించారంటూ కొందరు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీనివాసరావును ఏ3గా చేర్చారు. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు, ఫిర్యాదుదారులతో కలిసి గతవారం ఏపీ హైకోర్టు వద్దకు వెళ్లగా..కిడ్నాప్ కలకలం రేగింది. ఆ తర్వాత శ్రీనివాసరావు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు వెళ్లి.. విజయవాడ, హైకోర్టు ప్రాంగణంలో తనకు ఎదురైన వేధింపులు, దాడి యత్నాలను వీడియోలతో అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా కాన్సులేట్ అధికారుల సాయంతో శ్రీనివాసరావు తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు.
శ్రీనివాసరావు కుమార్తె వేధించిన పోలీసులు..!.. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు ఆచూకీ కోసం పెనమలూరు పోలీసులు.. హైదరాబాద్‌కు వెళ్లి ఆయన కుమార్తెను ఇబ్బంది పెట్టినట్లు శ్రీనివాసరావు తరుపు న్యాయవాది తెలిపారు. పోలీసులు వేధించిన తీరుపై ఆమె కాన్సులేట్‌లో కూడా ఫిర్యాదు చేసిందని వివరించారు. మరోవైపు కుదరవల్లి శ్రీనివాసరావు కుమార్తె, కుటుంబ సభ్యులు యాదగిరిగుట్ట వెళ్లి వస్తుండగా ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారంటూ.. ఏపీ ప్లానింగ్ బోర్డు మాజీ ఛైర్మన్ కుటుంబరావు తాజాగా (సోమవారం) హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ సమీపంలోని కానూరు ట్రస్ట్ భూములపై వైఎస్సార్సీపీ నేతలు కన్నేశారని, దానిపై న్యాయ పోరాటం చేస్తున్న శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. దీనిపై తాము కూడా న్యాయపోరాటం చేస్తామని కుటుంబరావు వెల్లడించారు.
లుక్ ఔట్ నోటీసులు జారీ..!.. ప్రవాస భారతీయుడు కుదరవల్లి శ్రీనివాసరావు ఆచూకీ కోసం.. ఆయన అమెరికాకు వెళ్లిపోకుండా చేయటం కోసం పెనమలూరు పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు ఓ ప్రచారం కూడా సాగుతోంది. అయితే, ఆయన అప్పటికే అమెరికా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ నోటీసుల జారీ వ్యవహారంపై పోలీసులు ధ్రువీకరించకపోవటం చర్చనీయాంశంగా మారింది.