KRMB RMC Meeting : తెలంగాణ గైర్హాజరీ మధ్య కృష్ణా నదీ యాజమాన్య జలాశయాల పర్యవేక్షక కమిటీ తన నివేదికను పూర్తి చేసింది. శనివారం నాటి సమావేశానికి కొనసాగింపుగా ఆర్‌ఎంసీ ఇవాళ మరోమారు భేటీ అయింది. హైదరాబాద్ జలసౌధలో కన్వీనర్ రవికుమార్ పిళ్ళై నేతృత్వంలో సమావేశంలో బోర్డు అధికారులు, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి తెలంగాణ సభ్యులు గైర్హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రూల్ కర్వ్స్, జల విద్యుత్ ఉత్పత్తి అంశాలపై చర్చించి సిఫారసుల నివేదికపై సంతకాలు చేసేందుకు సమావేశం జరిగింది.
నివేదికపై బోర్డు సభ్యులతో పాటు ఏపీ సభ్యులు సంతకాలు చేశారు. నివేదికను బోర్డుకు నివేదిస్తామని ఆర్‌ఎంసీ తెలిపింది. ఆర్‌ఎంసీ సమావేశంలో నివేదికపై సంతకం చేశామన్న ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి... తెలంగాణ హాజరై ఉంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్వహణ విధానాలు కొలిక్కి వచ్చేవని తెలిపారు. శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య స్పష్టత వచ్చేదన్న ఆయన.. శాశ్వత ఆర్‌ఎంసీ కూడా ఏర్పాటు అయ్యేదని తెలిపారు. అటు కృష్ణా బోర్డు ఛైర్మన్ కు లేఖ రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్... ఆర్‌ఎంసీ నివేదికను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎంసీ ముసాయిదా నివేదికలోని అంశాలు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్దంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. నీరు, జలవిద్యుత్ ఉత్పత్తి, క్యారీ ఓవర్ స్టోరేజీ సహా వరద సమయంలో నీటి వినియోగానికి సంబంధించి తెలంగాణ అభిప్రాయాల్లో ఎలాంటి మార్పు లేదని అన్నారు. నివేదికలోని అంశాలు తమకు ఆమోదయోగ్యం కావని రజత్ కుమార్ లేఖలో స్పష్టం చేశారు. తాము లేవనెత్తిన అంశాలపై మీడియాకు తగిన వివరణ ఇవ్వాలని ఆర్ ఎంసీ కన్వీనర్‌ను ఆదేశించాలని కోరారు.
ఇవీ చూడండి: