JUSTICE ABDUL NAZEER OATH AS AP GOVERNOR : రాష్ట్ర నూతన గవర్నర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా.. ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ప్రతిపక్షనేత చంద్రబాబు ..పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
నూతన గవర్నర్ ప్రస్థానం.. బిశ్వభూషణ్ హరిచందన్ స్ధానంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం స్వీకారం చేశారు. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించిన అబ్దుల్ నజీర్.. మంగళూరులో న్యాయవిద్యను అభ్యసించారు. 1983లో కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో అడ్వకేట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 2003 మే నెలలో కర్ణాటక హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత అదే హైకోర్టులో పర్మినెంట్ న్యాయమూర్తిగా అవకాశం చేజిక్కించుకున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూనే 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు పదోన్నతి లభించింది.
ట్రిపుల్ తలాక్ చెల్లదని 2017లో తీర్పు ఇచ్చిన సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ నజీర్ కూడా ఒకరు. ఇక 2019లో అయోధ్య రామజన్మభూమి కేసు తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల బెంచ్‌లోనూ జస్టిస్ నజీర్ ఉన్నారు. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో హిందూ నిర్మాణం ఉనికి ఉందంటూ.. భారత పురావస్తు శాఖ ఇచ్చిన తీర్పును జస్టిస్ నజీర్ సమర్థించారు. 2023 జనవరి 4నే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదవీ విరమణ చేయగా.. కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌గా సిఫారసు చేసింది. కేంద్రం సిఫారసుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. బిశ్వభూషణ్ ప్లేస్‌లో కొత్తగా వచ్చిన జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు ఆంధ్రప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా ప్రమాణం చేశారు.
ఇవీ చదవండి: