BJP state president Somuveer raju latest comments: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు కలిసే ఉన్నాయని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అందుకే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తాజాగా దిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిశారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన - బీజేపీలు కలిసి రాష్ట్రంలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపుతాయని తెలిపారు. రాజకీయాల్లో ఎవరూ అంటరానివాళ్లు కాదని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలవడంలో తప్పేముంది..? గతంలో తాను కూడా చంద్రబాబును కలిశానని సోము వీర్రాజు గుర్తు చేశారు. రాజకీయంగా జనసేన-బీజేపీలు కలిసి పని చేస్తాయని సోము వీర్రాజు పేర్కొన్నారు.
కలిసే పోరాడుతాం: ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ.. "జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయి, కలిసే ముందుకు వెళతాం. ఈ ప్రభుత్వంపై ఇద్దరం కలిసే పోరాడతాం. కలిసి ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా జనసేన, బీజేపీ కలిసే ప్రయాణం చేస్తాయి. రాజకీయ అవసరాల కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తాం. గతంలో చంద్రబాబును కూడా రాష్ట్రపతికి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశాం. అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదు. తాజాగా పవన్ కల్యాణ్ మా పార్టీ పెద్దలను కలిసి మాట్లాడారంటే.. మా బంధం ఎంత బలమైనదో తెలుసుకోండి. మేమిద్దరం కలిసి వైసీపీ ప్రభుత్వం మీద ఉద్యమిస్తాం. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. రాజకీయాల్లో కొన్ని రచనలు జరుగుతాయి. నాయకులు ఏది మాట్లాడినా ఒక వ్యూహంతో మాట్లాడతారు. మా సత్యకుమార్, ఇతర నేతలపై దాడి అందరూ చూశారు. మా పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉంది'' అని ఆయన అన్నారు.
ఈ ప్రభుత్వం ఒక్కరినైనా అరెస్ట్ చేసిందా?: అనంతరం ఫిరంగిపురంలో తాజాగా గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెద్ద ఎత్తున జరిగాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో హైందవ ధర్మం అపహస్యం అవుతోందన్నారు. ఫిరంగిపురంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూమతంపై దాడులు జరుగుతోంటే.. ఒక్క అరెస్టైనా జరిగిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వివిధ విషయాల్లో ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం.. దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిలో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? అని మండిపడ్డారు.
ధ్వంసం వెనుక కుట్ర: ఫిరంగిపురంలో వినాయక విగ్రహం ధ్వంసం వెనుక భారీ కుట్ర దాగి ఉందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీరు మారకుంటే.. కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ దారుణమని సోము వీర్రాజు పేర్కొన్నారు. పరీక్షపత్రాల లీకేజీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమన్నారు. పేపర్ లీకేజీలో బండి సంజయ్‌కు సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అవినీతి సంపదతో దేశ రాజకీయాలు నడిపే ప్రయత్నం చేస్తున్నారన్నారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి