IMD predicts heavy rain in ap: రాష్ట్రంలో రెండు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇప్పటికే విజయవాడ, పల్నాడు తదితర జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో హటాత్తుగా వాతావరణం చల్లబడింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు పలుచోట్ల ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై ఎక్కడ గోతులున్నాయో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కిన నగరం ఒక్కసారిగా చల్లబడింది. ఎండవేడితో అల్లాడుతున్న నగరవాసులకు కొంత ఉపశమనం దక్కినా..
రైతులకు తీవ్రనష్టం: చేతికి వచ్చిన పంట పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందిగామ, మైలవరం ప్రాంతాల్లో మొక్కజొన్న గింజలను రైతులు ఆరబోశారు. వర్షానికి అవి పూర్తిగా తడిసిపోవటంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికే (ఐఎండీ) వాతవరణ శాఖ మూడు రోజుల పాటు ఏపిలో పలు ప్రాంతాలు వర్షాలు పడే అవకాశం ఉందని సూచనలిచ్చింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
పిడుగుపాటుకు రైతు మృతి: పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు, క్రోసూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. కళ్ళాల్లో ఆరబెట్టుకున్న మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయ్యింది. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామంలో పిడుగుపాటుకు గురై కడియం వెంకట్రావు (38) అనే రైతు మృతి చెందాడు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చెతికి వచ్చిన పంట వర్షంలో తడి ముద్దవడంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు: రాష్ట్రంలో రెండు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. రేపు పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కోనసీమ, ప్రకాశం, అన్నమయ్య చిత్తూరు, వైఎస్సార్, సత్యసాయి , అనంతపురం, కర్నూలు, నంద్యాల మన్యం, అల్లూరి జిల్లా, కాకినాడ, తూ.గో. ఏలూరు, కృష్ణా, తిరుపతి, ప.గో.జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి: