Garbage Tax Burden Vijayawada on People: విజయవాడ నగరపాలక సంస్థ విధిస్తున్న పన్నులు సామాన్య ప్రజలు బెంబేలెత్తిస్తున్నాయి. ఓ వైపు పెరుగుతున్న ధరలతో పాటు నగరపాలక సంస్థ మోపుతున్న పన్నుల భారంతో నగరపాలకవాసులు హడలిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని పేర్లతో పాలకసంస్థ పన్నులను విధిస్తోంది. దీంతో ఈ పన్నుల భారాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు. భారీ మొత్తంలో విధించే పన్నులు చెల్లించలేమని ప్రజలు చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలపై వాలంటీర్ల నుంచి మొదలు ఉన్నతాధికారుల వరకు బెదిరింపులకు దిగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
విజయవాడలో సుమారు 3 లక్షల 16 వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గతం నుంచీ ఇంటి పన్నులోనే కుళాయి పన్ను, చెత్త పన్ను ఉండేది. ఈ విధంగానే అధికారులు వసూలు చేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి పన్నును వర్గీకరించి.. చెత్త పన్ను, కుళాయి పన్ను, ఇంటిపన్ను అని వేర్వేరుగా వసూలు చేస్తోంది.
చెత్త పన్ను పెంపుపై ప్రజల ఆగ్రహం
ఈ క్రమంలో ప్రజల నుంచి చెత్త పన్నుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చాలాచోట్ల ప్రజలు చెత్త పన్ను చెల్లించలేమని తెగేసి చెబుతున్నారు. దీంతో ఉన్నతాధికారుల ఒత్తిడితో కింది స్థాయి సిబ్బంది.. ప్రభుత్వ పథకాల్లో కోత విధిస్తామని బెదిరించి మరీ వసూళ్లకు దిగుతున్నారు. ఆదాయాలు అంతంతమాత్రంగా ఉన్న తమపై ఈ బాదుడేంటని.. సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెత్త పన్నును ఒక్కో కుటుంబానికి ప్రాంతాన్ని బట్టి నగరపాలక సంస్థ వేర్వేరుగా వసూలు చేస్తోంది. మురికివాడల్లో ఒక్కో కుటుంబానికి 30రూపాయలు, సాధారణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి 120 రూపాయలు చెత్త పన్ను విధిస్తున్నారు. నగరంలోని 48వేల దుకాణాలు, ఇతర షాపింగ్ కాంప్లెక్స్‌లు వంటి వాటి ద్వారా చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. వ్యాపార కేంద్రాలకు 150 రూపాయల నుంచి 15 వేల రూపాయల వరకు చెత్త పన్ను వసూలు చేస్తున్నారు.
చెత్త పన్ను కట్టలేదని మున్సిపల్ సిబ్బంది ఏం చేశారంటే
"చెత్త పన్ను ఎందుకు కట్టాలంటే మాత్రం.. వాలంటీర్ల చేత బెదిరింపులకు దిగే పరిస్థితి వచ్చింది. పింఛన్లను నిలిపివేస్తాం, ఇళ్ల పట్టాలను రద్దు చేస్తాం ఈ రకంగా బెదిరింపులకు దిగి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. అయినా ప్రజలు చెత్తపన్ను కట్టడానికి ప్రజలు సుముఖంగా లేరు." -నారాయణ, విజయవాడ వాసి
"మంచినీటి సరఫరా నిలిపివేస్తాం, రేషన్ బియ్యం పంపిణీ నిలిపివైస్తామని వాలంటీర్ల చేత భయపెట్టి.. చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా ఈ విధంగా డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తోంది." -రాజు, విజయవాడ వాసి
నగరంలోని ప్రజలు పలు రకాల పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సరైన ఉపాధి లేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. జీవన పోరాటంలోనే సమస్యలున్న సమయంలో ఇలా పన్నుల పేరుతో బాదుడేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యవస సరుకుల ధరలు పెరగి అల్లాడిపోతుంటే.. ఇంటిపన్ను, చెత్తపన్ను పేర్లతో అదనపు భారం మోపితే జీవనం ఎలా సా సాగించేదని ప్రశ్నిస్తున్నారు. పిల్లల చదువుల ఫీజులు, ఇళ్ల అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని.. అలాంటి సమయంలో ఇంటిపన్ను, చెత్తపన్ను పేరుతో అదనపు భారం వేస్తే బతికేదెలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Garbage tax: చెత్త పన్ను వసూలు చేయాల్సిందే.. కమిషనర్లపై ఒత్తిడి
గతంలో ఇంటి అద్దె ఆధారంగా ఇంటి పన్నులు వసూలు చేస్తుండగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆస్తి విలువ ఆధారంగా వసూలు చేస్తున్నారని ప్రజలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. 24 గంటల నీటి సరఫరా పేరుతో మరో దోపిడీకి సిద్ధమయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"విజయవాడ నగరాభివృద్ధిలో మాత్రం నత్తనడక సాగుతూ.. పన్నుల భారంలో మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు వేరు.. చేస్తున్న పనులు వేరు. ప్రతి ఏడాది 25 కోట్ల రూపాయల పన్నుల భారం వేస్తున్నారు. చెత్తపన్ను రద్దు చేయాలని సీపీఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం." -సత్తిబాబు, సీపీఎం నేత
Concern of auto drivers : 'ముఖ్యమంత్రి గారూ.. మాట నిలబెట్టుకోరా? స్వచ్ఛ ఆటో డ్రైవర్ల అవస్థలెన్నో..'