Financing For Ports Construction: రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన మూడు నాన్ మేజర్ పోర్టులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా 20 పోర్టులకు 8 వేల 244 కోట్ల రూపాయల మేర రుణం ఇచ్చేందుకు ఇండియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఏపీలోని మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టులకు కూడా నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉన్నందున జనవరి, లేదా ఫిబ్రవరి నెలలో టెండర్లను పిలిచి పనులు ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం.
మచిలీపట్నం పోర్టును 30 నెలల్లో పూర్తిచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదికి 30 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యంతో ఈ పోర్టు నిర్మాణం కోసం తొలి దశలో వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసినట్లు తెలుస్తోంది. రామాయపట్నం పోర్టులో నాలుగు బెర్తుల నిర్మాణాన్ని 2023 చివరి నాటికి పూర్తిచేసే అవకాశం ఉంది. 34 మెట్రిక్ టన్నుల సరకు రవాణా లక్ష్యంగా ఈ పోర్టును సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఈ పోర్టులు అనుకున్న సమయానికి సిద్ధమయితే దక్షిణ భారతదేశంలోని కార్గో ఎగుమతి, దిగుమతులు ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి.
ఇవీ చదవండి