Electricity Workers Protest Program: విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద 17-08-2023 తేదీన చేపట్టాల్సిన ధర్నాను వాయిదా వేసుకున్నట్టు విద్యుత్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ (Electricity employees Union) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సుబ్బిరెడ్డి వెల్లడించారు. పోలీసుల ఆంక్షల దృష్ట్యా ధర్నాను వాయిదా వేసుకున్నట్టు స్ట్రగుల్ కమిటీ ప్రకటించింది. తమ నిరసన తెలియచేసేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు స్ట్రగుల్ కమిటీ తెలిపింది. మాస్టర్ స్కేల్ తో పాటు జూనియర్ లైన్ మెన్ లు , ఇతర కాంట్రాక్టు ఉద్యోగుల వేతన సవరణ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోటంతో విద్యుత్ సౌధ వద్ద ధర్నాకు పిలుపునిచ్చినట్టు స్ట్రగుల్ కమిటీ వెల్లడించింది. విద్యుత్ జేఏసీ తో ప్రభుత్వం నిర్వహిస్తున్న చర్చల్ని గుర్తించబోమని స్ట్రగుల్ కమిటీ స్పష్టం చేసింది.
5 ఏళ్ల కాలం నాటి సిఫార్సులతో వేతనాలు: మరోవైపు 2018 పీఆర్సీ ప్రకారం అవుట్ సోర్సింగ్ (Outsourcing), కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు సవరిస్తామని ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తున్నట్టు స్ట్రగుల్ కమిటీ ప్రకటించింది.2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు సవరించకుండా 5 ఏళ్ల కాలం నాటి సిఫార్సులతో వేతనాలు చెల్లించటం ఏమిటని ప్రశ్నించింది. విద్యుత్ ఉద్యోగులతో చర్చలు జరుగుతున్న సమయంలోనే 2018 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోతో పాటు సబ్ కమిటీ చర్చలపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ.. ఆందోళనలకు సమాయత్తం అవుతోంది.
2018 రివైజ్డ్ పే స్కేళ్ల ప్రకారం వేతనాలు: తాజాగా ఏపీ ట్రాన్స్ కోలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు 2018 రివైజ్డ్ పే స్కేళ్ల ప్రకారం వేతనాలు సవరిస్తూ ట్రాన్స్ కో సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా ట్రాన్స్ కోలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సవరించినట్టు ఉత్తర్వులు విడుదల అయ్యాయి. హైస్కిల్డ్ , స్కిల్డ్ , సెమీ స్కిల్డ్ , అన్ స్కిల్డ్ కార్మికులకు వేతనాలను సవరించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.
'ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన కారణంగా ఆగస్టు 17 తేదీన విద్యుత్ సౌధ వద్ద తలపెట్టిన మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. ధర్నాకు అనుమతించేలా పోలీసుల్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేస్తుస్తాం. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాక స్ట్రగుల్ కమిటీ ధర్నా నిర్వహిస్తుంది. ఉత్తర్వుల అనంతరం మహాధర్నా తేదీని మళ్లీ ప్రకటిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా... విద్యుత్ ఉద్యోగులకు సైతం కనీసం 23 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి. విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించిన 8 శాతం ఫిట్మెంట్ స్ట్రగుల్ కమిటీ కి ఆమోదయోగ్యం కాదు. కాంట్రాక్టు కార్మికులకు (Contract workers 2022) పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. థర్డ్ పార్టీ విధానాన్ని తొలగించి విద్యుత్ యాజమాన్యాలే నేరుగా కార్మికులకు వేతనం ఇవ్వాలి. కాంట్రాక్టు కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలి.'- వి.సుబ్బిరెడ్డి, స్ట్రగుల్ కమిటీ ప్రధాన కార్యదర్శి