Father Left child: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. జి.కొండూరు గ్రామానికి చెందిన హరిబాబు భార్య కొంత కాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో.. ఏం చేయాలో తోచక, బ్రతుకు తెరువు కోసం వారం క్రితం ఐదుగురు పిల్లలతో పెనుగంచిప్రోలు చేరుకున్నాడు. అప్పట్నుంచి హరిబాబు రోజూ మద్యం తాగి ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నాడు. పిల్లలు ఆకలితో అలమటిస్తుండటంతో.. స్థానికులే పిల్లకు అన్నం అందిస్తూ వచ్చారు. అయితే, పిల్లలు ఉంటున్న గుడిసె వద్ద గత రెండు రోజులుగా మున్నేరులో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో.. గమనించిన స్థానికులు శనివారం పోలీసులకు, అంగన్వాడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పిల్లలను స్థానిక పంచాయతీ కార్యాలయానికి తీసుకువచ్చారు. గ్రామ సర్పంచి ఆకలితో ఉన్న చిన్నారులకు ఆహారాన్ని అందజేశారు. హరిబాబు నుంచి పూర్తి వివరాలు సేకరించారు. తండ్రి హరిబాబుకు కౌన్సిలింగ్ చేస్తామని, పిల్లలను శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే చైల్డ్ కేర్ సెంటర్‌కు పంపిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: