Cyber Frauds: మీరు ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదివచ్చు.. మా స్కీమ్‌లో చేరి.. మరొకరిని చేర్పిస్తే చాలు కమిషన్ వస్తుందంటూ నమ్మిస్తారు. గొలుసు కట్టు పద్ధతిలో కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో.. ఓ ఆన్‌లైన్ యాప్ సామాన్యులకు కుచ్చుటోపీ పెట్టింది. గొలుసు కట్టు పద్ధతిలో కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. రెండు నెలల క్రితం పుట్టుకొచ్చిన డిజిటల్ ఎనర్జీ మైనింగ్ యాప్‌లో పలువురు పెట్టుబడులు పెట్టి మోసపోయారు. దాదాపు 10 కోట్లు బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.
ఒకరి నుంచి మరొకరికి చేరిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా 500 నుంచి 3 లక్షల రూపాయల వరకూ కట్టారు. కొత్తవాళ్లని యాప్ ఇన్‌స్టాల్ చేపిస్తే.. పరిచయం చేసిన వారికి రూ.150 కమిషన్ వస్తుందని నమ్మించడంతో పోటీపడి మరీ ఎక్కువ మందిని చేర్పించారు. 30 రోజుల్లో సొమ్ము రెట్టింపు అవుతుందని ఆశచూపి నిర్వాహకులు కోట్లలో దోచుకున్నారు.
లబోదిబోమంటున్న బాధితులు: అధిక వడ్డీ, కమిషన్ల పేరుతో సామాన్యులను ఆకర్షించి అనేక మందిని మోసం చేశారు. కొన్నాళ్లుగా యాప్ పని చేయకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి ఘటన అవనిగడ్డ ప్రాంతంలో ఇటీవల బయటపడింది. మోసపోయామని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అధిక వడ్డీ పేరుతో వల: మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలు అధిక వడ్డీ పేరుతో వల వేస్తుంటారు. దీనికి అదనంగా కొత్తగా సభ్యులను పరిచయం చేస్తే బోనస్ ఇస్తామని ఎర వేస్తున్నారు.ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సామాన్యులను ఆకర్షిస్తుంటారు. డిజిటల్ ఎనర్జీ మైనింగ్ యాప్ కూడా ఇదే పద్ధతిని అనుసరించి మోసాలకు పాల్పడిందని పోలీసులు పేర్కొన్నారు.
Extra Income Scam : ఘరానా మోసం.. అదనపు ఆదాయమని నమ్మించి.. 19 లక్షలు వసూలు.. చివరకు
పేద, మధ్య తరగతి వారే లక్ష్యంగా: కొత్తగా సభ్యులను చేర్పిస్తే.. ఏసీలు, వాషింగ్ మిషన్‌లు, రిప్రిజరేటర్‌లు, ఖరీదైన సెల్‌ఫోన్లు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు బహుమతులుగా ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు. అది నమ్మిన పలువురు.. ఇళ్లు, స్థలాలు, బంగారం అమ్మి పెట్టుబడి పెట్టారన్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా.. వల వేసి తమ ఉచ్చులో పడేలా చేస్తున్నారు.
భారీగా డబ్బు వచ్చిన తరువాత ఉడాయిస్తారు: భారీగా డబ్బు పోగుపడిన తర్వాత నిర్వాహకులు బోర్డు తిప్పేస్తున్నారంటున్నారు. ఇటువంటి వాటికి ప్రజలు ఆకర్షితులు కావద్దని పోలీసులు సూచిస్తున్నారు. మోసపోయినవాళ్లు వెంటనే తమకు ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం చేస్తామని అంటున్నారు. అధిక వడ్డీలకు, కమిషన్లకు ఆశపడి అనధికార యాప్‌లను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Online Trading Fraud : ఆన్‌లైన్ ట్రేడింగ్ ఉచ్చు.. యువకుడు జేబు ఖాళీ