Digital Class Room In Government School : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడి ఆలోచన.. కొంతమంది దాతలిచ్చిన ఆర్థిక సహాయంతో డిజిటల్ తరగతి గది నిర్మించారు. సుమారు వంద మంది కూర్చోవడానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎంత దూరం నుంచి చూసినా స్క్రీన్ కనిపించేటట్లు తరగతి గదిని రూపొందించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ సబ్జెక్టులన్నింటినీ డిజిటల్ క్లాస్‌రూమ్‌లో బోధిస్తున్నారు. తరగతి గదిలో చెప్పిన పాఠాలు తిరిగి డిజిటల్ క్లాస్ రూములో బోధించడంతో పాఠాలు తమకు బాగా అర్థమవుతున్నాయని విద్యార్థులు చెప్తున్నారు.
"మాకు తెలుగులో ఉపవాచకంలో ఉన్న రామాయాణాన్ని డిజిటల్ క్లాస్‌లో చూపించారు. అలాగే భౌతిక శాస్త్రంలోని పాఠాలను కూడా ఇందులో చూపించారు. తరగతిలో మేడం చెప్పడంతో పాటు ఇందులో చూపించారు. " -పాఠశాల విద్యార్థిని
"తరగతి గదిలో చెప్పినవన్నీ ఈ డిజిటల్ క్లాస్‌రూంలో చూపిస్తున్నారు. దీనిలో చూపించటం ద్వారా చాలా చక్కగా అర్థమవుతోంది. తరగతి గది పాఠలకంటే దీనిలో చాలా బాగా అర్థమవుతున్నాయి." - పాఠశాల విద్యార్థిని
కొంతమంది దాతలతోపాటు గ్రామస్తుల సాయంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ తరగతి గదిని రూపొందించారు. దాదాపు 10లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ డిజిటల్ గదిని నిర్మించామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూరిబాబు తెలిపారు. విద్యార్థులు ఎండలకు ఇబ్బంది పడకుండా ఎనిమిది ఫ్యాన్లు, 4ఏసీలు ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించడంతోపాటు.. పాఠశాలలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఈ డిజిటల్ రూమ్‌ను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు.
"తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలకు సంబంధించిన అంశాలను సేకరించి.. విద్యార్థులకు డిజిటల్ క్లాస్‌లో ప్రదర్శిస్తున్నాము. ఇలా చేయటం వల్ల విద్యార్థులు పరీక్షలు బాగా రాయగల్గుతున్నారు. మంచి ఫలితాలను సాధిస్తున్నారు. అంతేకాకుండా ఇది విద్యార్థులు మనోవికాసానికి ఎంతగానో తోడ్పడుతొంది." - సూరిబాబు, ప్రధానోపాధ్యాయుడు
పాఠాలు బోధించేటప్పుడు వివిధ భావాలను ఎంత చక్కగా వివరించి చెప్పిన విద్యార్థులకు చూసినట్లుగా ఉండదు. అదే ఇలా అయితే పాఠంలోని ప్రతి భావాన్ని ప్రదర్శించటానికి వీలు ఉంటుంది." - పాఠశాల ఉపాధ్యాయురాలు
విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా వారికి అర్థమయ్యే విధంగా బోధించడానికి ఈ డిజిటల్ తరగతి గది ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.
ఇవీ చదవండి: