Differences Between Mylavaram YCP leaders: అధికార వైసీపీలో వర్గ పోరు సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ వరకు చేరింది. గురువారం మైలవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు మంత్రి జోగి రమేష్ వల్ల పార్టీలో అనవసరంగా విభేదాలు వస్తున్నాయని సీఎంకు ఫిర్యాదు చేశారు.
పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ మైలవరం పరిధిలో నివాసం ఉంటూ..నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. నియోజకవర్గంలో మంత్రి వ్యవహారం గురించి కార్యకర్తలు సీఎంకు వివరించారు.
రెండున్నర గంటలకు పైగా జరిగిన భేటీలో 10 నుంచి 15 నిమిషాలు సీఎం మాట్లాడగా..మిగిలిన సమయమంతా కార్యకర్తలు మంత్రిపై ఫిర్యాదు చేయడం..వారి వ్యక్తిగత సమస్యలు చెప్పడానికే సరిపోయింది. ‘వారంలోగా మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌లను పిలిచి మాట్లాడతానని సీఎం అన్నారు. వచ్చే ఎన్నికల్లో 2019 కంటే ఎక్కువ మెజారిటీతో పార్టీని గెలిపించాలని సీఎం కార్యకర్తలకు ఉద్బోధించారు.
ఇప్పటి వరకు నిర్వహించిన నియోజకవర్గాల సమీక్షల్లో ఫలానా వ్యక్తే అభ్యర్థి అంటూ కార్యకర్తలకు సీఎం జగన్ స్పష్టంగా చెబుతూ వచ్చారు. మైలవరం విషయంలో మాత్రం కృష్ణప్రసాద్‌కు కార్యకర్తలు తోడుగా ఉండాలని చెప్పడమే తప్ప కచ్చితంగా ఆయనే పార్టీ అభ్యర్థి అనే స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ను ఈ విషయంపై విలేకర్లు ప్రశ్నించగా..ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. టికెట్ విషయంలో జగన్ నిర్ణయమే శిరోధార్యమన్నారు. మైలవరం అభ్యర్థిపై జగన్ స్పష్టత ఇవ్వకపోవడంతో కార్యకర్తలు, నేతల్లో సందిగ్ధం నెలకొంది.
ఇవీ చదవండి: