Devineni Uma On Guide Bund collapsed: పోలవరం గైడ్‌బండ్ కుంగిపోవడానికి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తే కారణమని మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వైసీపీ హయాంలో నిర్మించిన గైడ్‌బండ్‌లో అక్రమాల బయటపడకుండా కప్పిపుచ్చుకోవటమే, జగన్మోహన్ రెడ్డి పోలవరం సుడిగాలి పర్యటన ఆంతర్యం అని ఉమ ధ్వజమెత్తారు. నాలుఏళ్లలో నాలుగు సార్లు పోలవరం పర్యటనకు వెళ్లిన సీఎం, చివరి పర్యటనను కూడా మొక్కుబడిగా నిర్వహించారని మండిపడ్డారు. గైడ్‌బండ్‌లో అక్రమాలు బయటపకూడదనే ప్రాజెక్టు వద్దకు మీడియాను కూడా నియంత్రించారన్నారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలో పోయిన డబ్బుల్ని తిరిగి రాబట్టడం కోసమే పోలవరం ఎత్తు తగ్గించారని ధ్వజమెత్తారు. పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించినట్లు కేసీఆర్ మాట్లాడిన వీడియోను ఉమ విడుదల చేశారు. జూలైలో వచ్చే వరదల నుంచి నిర్వాసితుల్ని ఏ విధంగా కాపాడబోతున్నారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నాలుగు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఉమ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి ఒదిలేసిందని ఉమ ఆరోపించారు. గైడ్‌బండ్‌పై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పోలవరం గైడ్‌బండ్ కుంగిపోవడంపై మంత్రి అంబటి రాంబాబు, సీఎం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో చట్టం చేసి.. జాతీయ ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో నాశనం చేశాడని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ డబ్బు పిచ్చితో పోలవరాన్ని నట్టేట ముంచాడని ఉమ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిధుల కోసం.. జగన్ పోలవరం డ్యాంను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టాడని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ కమీషన్ల కక్కుర్తి ఫలితం వల్లే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయింది. వైకాపా ప్రభుత్వం నిర్మించిన గైడ్ బండ్‌లో అక్రమాల బయటపడకుండా కప్పిపుచ్చుకోవటం కోసమే సీఎం పోలవరం సుడిగాలి పర్యటన. నాలుగేళ్లలో నాలుగు సార్లు పోలవరం పర్యటనకు వెళ్లిన సీఎం... చివరి పర్యటనను కూడా మొక్కుబడిగా నిర్వహించారు. -దేవినేని ఉమ, తెలుగుదేశం సీనియర్ నేత
అసలేం జరిగిందంటే...: పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ఎగువన ఎడమ వైపు నిర్మిస్తున్న గైడ్‌బండ్ కుంగింది. సుమారు 500 మీటర్ల పొడవు.. కింది నుంచి సుమారు 26 మీటర్ల ఎత్తులో దీని నిర్మించారు. ఈ ప్రాజెక్టు పనులు సైతం మేఘా ఇంజినీరింగు కంపెనీయే చేస్తోంది. గత సంవత్సరం చేపట్టిన నిర్మాణం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చే సమయంలో గైడ్‌బండ్ మధ్యలో పగులులా ఏర్పడి... అప్రోచ్ ఛానల్ వైపునకు కుంగిపోయింది. గైడ్‌బండ్‌లో భాగంగా నిర్మించిన కట్టతో పాటుగా... అందులోని రాళ్లు కిందికి జారిపోయాయి. దీంతో ఇందులోని రిటైనింగ్ వాల్ కుంగింది. కటాఫ్ సరిగా లేకపోవడం వల్లే గైడ్‌బండ్ కుంగిపోయి ఉంటుందని కొందరు ఇంజినీర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ విషయం చేరవేశారు. గైడ్‌బండ్ కుంగడానికి కారణాలు, దానిని ఎలా సరిదిద్దాలనే అంశాలపై పోలవరం అథారిటీ అధికారులతో పాటుగా.. డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుదని తెలుస్తోంది. మెుదట శుక్ర, శనివారాల్లో కొన్ని పగుళ్లు వచ్చాయని, ఆదివారం నాటికి పూర్తిగా కుంగిపోయిందని అధికారులు వెల్లడించారు.