Drainage System In Bezawada: విజయవాడలో మురుగు కాల్వల పరిస్థితి రోజురోజుకి అధ్వానంగా మారుతోంది. దుర్వాసనతో ప్రజలు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో ఐదేళ్ల అభిరామ్ మురుగు కాల్వలో పడి దుర్మరణం చెందాడు. తూతూ మంత్రంగా విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు కొన్ని చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో విజయవాడలో డ్రైయినేజీ వ్యవస్థను చక్కదిద్దడానికి అభివృద్ధి ప్రణాళికలు రచించారు. తరువాత కాలంలో ఎన్నికలు రావడం నూతన ప్రభుత్వం ఏర్పడడం, నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ప్రణాళికలను పక్కన పెట్టేసింది..
విజయవాడలో చిన్నపాటి వర్షానికే మురుగుకాల్వలు జలమయమై.. రోడ్లపైకి పొంగి ప్రవహిస్తున్నాయి. నగరంలోని చాలా కాలనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మురుగు కాల్వ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో.. దుర్వాసన వెదజల్లుతున్నాయి. దోమల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. నగరంలో చాలా వరకు డ్రెయినేజీలకు పైకప్పులు లేవు. దీంతో వర్షాలు పడినప్పుడు దారి కనిపించకుండా పోతోంది. ఫలితంగా తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో అనేక మంది మురుగు కాల్వల్లో పడిపోయి.. ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఐదేళ్ల బాలుడు అభిరామ్... ఆడుకుంటూ వెళ్లి మురుగుకాల్వలో పడి మృతిచెందడం... అందరినీ కలచివేసింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో చిన్నాపెద్దా అన్నీ కలిపి 12 వందల 37 ఓపెన్ డ్రెయిన్లు ఉన్నాయి. వీటిలో 97 డ్రెయిన్లు... పైకప్పు, పక్కగోడలు లేకుండా ప్రమాదకరంగా ఉన్నాయి. 2007లో భూగర్భ డ్రెయినేజ్ వ్యవస్థ ఏర్పాటు కోసం.. 175 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విజయవాడలో ప్రస్తుతం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కనెక్షన్లు ఉన్న ఇళ్లు... 1.01 లక్షలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కనెక్షన్లు లేని ఇళ్లు నగరంలో 1.09 లక్షలు ఉన్నాయని... అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి..
నగరంలో ప్రధాన కూడళ్లు, సెంటర్లలోనూ కాల్వలపై పైకప్పులు లేవు. వేసవిలో కురిసే వర్షాలకే కాల్వల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే... ఇక వర్షాకాలం ఇంకెంత దారుణంగా ఉంటుందోనని.. ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ... అభివృద్ధిపై పెట్టడం లేదని విమర్శిస్తున్నారు.
విజయవాడ నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోజుకో ప్రమాదం చూస్తున్నాం. ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరచి ఉన్నాయో తెలియడం లేదు డ్రెయినేజీ పొంగి పొర్లుతుంది. అధికారులకి ఫిర్యాదు చేస్తే తాత్కాలికంగా పనులు చేస్తున్నారు కానీ, శాశ్వత పరిష్కారం చూపటం లేదు.- నగరవాసి
ఇవీ చదవండి :