Daily Road Accidents Due To Incomplete Flyover : చిన్న సమస్య.. పెద్ద ప్రమాదంగా మారింది. అధికారుల నిర్లక్ష్యానికి ప్రయాణికులు.. తమ ప్రాణాలనే మూల్యంగా చెల్లిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారులో భూసేకరణ సమస్యతో ఫ్లైఓవర్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోగా.. అప్రోచ్ రహదారి పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Daily Road Accidents on National Highways : విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య 65వ నంబర్ జాతీయ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఇంతటి కీలక రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించకుండా అర్థాంతరంగా వదిలేశారు. దాంతో పాటే 880 మీటర్ల మేర రహదారిని నిర్మించకుండా కొన్నాళ్లుగా వదిలేశారు. ఇక్కడ ఫ్లైఓవర్, అప్రోచ్ రహదారి నిర్మాణానికి భూసేకరణ అవసరం కావడంతో సమస్య ఏర్పడింది. రైతులు, అధికారులకు మధ్య కోర్టు వివాదం నడుస్తోంది.
Officers Careless on Flyover Construction at Nandigama : అధికారులు ఈ సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కీలక ప్రాంతంలో వరుస (Road Accidents) రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. వారానికి కనీసం రెండు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్, రహదారి నిర్మించకపోవడంతో ఈ ప్రాంతానికి అడ్డంగా నందిగామ పట్టణంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా ఎప్పటికప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు కంటతడి పెట్టుకుంటున్నారు.
జాతీయ రహదారిపై వేగంగా వచ్చే వాహనాలు... రోడ్డు దాటే ద్విచక్ర వాహనాలు, మిగతా వాహనాలను ఢీకొంటున్నాయి. ప్రమాదాల్లో ఎందరో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. చాలామంది గాయాల పాలయ్యారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పాత రహదారి గుంతలతో నిండిపోయింది. వర్షం వస్తే రహదారిగోతుల మయంగా మారుతోందని అంటున్నారు. నీటితో నిండిపోయి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడిపోయి గాయపడుతున్నారు. ఫ్లైఓవర్ వంతెన నిర్మించేదాకా రహదారి నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. ఫలితంగా రోజూ ఈ మార్గంలో ప్రయాణికులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. తమ సమస్యను స్థానికులు, వాహన చోదకులు ఏకరువు పెడుతున్నారు.
నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న ఈ సమస్యపై అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని వేడుకుంటున్నారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఫ్లైఓవర్, అప్రోచ్ రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని స్థానికులు, వాహన చోదకులు అధికారులు కోరుతున్నారు.
"ఫ్లైఓవర్ నిర్మించకపోవడం వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కార్లు పల్టీలు కొడుతున్నాయి. ప్రమాదాల్లో చాలా మంది చాలా ప్రాణాలు కోల్పోయారు. అధికారులు మాత్రం ఈరోజు నిర్మాణం చేస్తాం.. నిర్మాణం పూర్తి కావస్తోంది అంటూ స్టేట్మెంట్లు చేస్తున్నారే తప్ప.. ఫలితం కనిపించడం లేదు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము."- అమరయ్య, అంబారుపేట