CPI Narayana Comments On Jagan : పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి పక్షాన నిలుస్తారా? లేదా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పక్షాన ఉంటారో తేల్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా చెబుతున్నట్లు పోలవరం ఎత్తును 41.5 మీటర్లకు పరిమితం చేస్తే ప్రయోజనం ఉండబోదన్నారు. అప్పుడు ఇది ప్రాజెక్టుగా కాకుండా రిజర్వాయరు అవుతుందని ఆయన అన్నారు. తద్వారా పోలవరం లక్ష్యం నెరవేరదని అన్నారు.
మూడు రాజధానులు..హైదరాబాద్కి డిమాండ్ : హైకోర్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనపైనా నారాయణ స్పందించారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ప్లాప్ షో నడుస్తోందని, దానికి కొనసాగింపుగానే ఇవన్నీ అని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చాక హైదరాబాద్కి డిమాండ్ పెరిగిందని, అలాగే అమెరికాకు కూడా ఇక్కడి నుంచి సంపద తరలిపోతోందన్నారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారాయణ విమర్శించారు.
రాహుల్‌కు శిక్ష .. రాజకీయ క్రీడ : దర్యాప్తు సంస్థల పని తీరును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తున్నామని ఆయన తెలిపారు. మోదీ అనే పేర్లు ఉన్న వాళ్లు మోసం చేసింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. విదేశాలకు పారిపోయిన వాళ్లల్లో విజయ్ మాల్యా మినహా అంతా గుజరాతీలేనని విమర్శించారు. 15లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన 28 మందిలో ఏడుగురు మోదీ పేరున్న వ్యక్తులేనని పేర్కొన్నారు. రాహుల్‌పై శిక్ష ఖరారు.. రాజకీయ కోణంలో ఆడుతున్న క్రీడగా అభివర్ణించారు. వాస్తవాలు చెబితే న్యాయస్థానాల ద్వారా కక్ష సాధిస్తారా అని ప్రశ్నించారు. మోదీకి జై కొడితే ఇంటికి, లేదంటే జైలుకి అన్న విధంగా కేంద్ర ప్రభుత్వ పనితీరు ఉందని మండి పడ్డారు. ఓటమి భయంతోనే మోదీ ఇటువంటి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు.. స్పష్టం చేసిన కేంద్ర జలశక్తి శాఖ : పోలవరం ప్రాజెక్టు ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని కేంద్రం తేల్చి చెప్పింది. తొలి దశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ లోక్ సభకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. తొలిదశలో సహాయ, పునరావాసం అంతవరకే ఇవ్వనున్నట్టు కేంద్ర జలశక్తిశాఖ స్పష్టం చేసింది. పోలవరంపై వైఎస్సార్సీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023 కే పూర్తి కావాల్సి ఉందన్న మంత్రి తొలిదశలో 20వేల 946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైనట్లు స్పష్టంచేశారు. ఇప్పటి వరకు కేవలం 11వేల 677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం అందించినట్టు మంత్రి తెలిపారు. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉందని అందులో కూడా జాప్యం జరిగినట్లు జలశక్తి శాఖ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి