CPI State Secretary Ramakrishna: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగితేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. పెనుగంచిప్రోలులో నూతనంగా నిర్మించిన సీపీఐ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గడచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి లేక అదోగతిపాలైందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు వైసీపీ పాలనతో బాధ పడుతున్నారన్నారు.
వైసీపీ ప్రభుత్వం కేవలం రాయలసీమకు చెందిన ఐదుగురు ముఠాతో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులకు పదవులు ఇచ్చి అధికారాలన్నీ ముఠా వద్దనే ఉంచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై, ప్రజల ఇబ్బందులపై గళమెత్తే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో నెంబర్ వన్ తీసుకువచ్చారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చీకటి రాజ్యానికి తెర లేపిందని రామకృష్ణ విమర్శించారు.
రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఉపాధి, ఉద్యోగ, అవకాశాలు, పరిశ్రమలు ఏమీ లేవని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కనీసం కడప జిల్లాలో సైతం చిన్న కాలువ కూడా తీయలేదని రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని రైతాంగానికి ఉపయోగపడే పోలంపల్లి మున్నేరు డ్యాం, వేదాద్రి ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే ప్రతిపక్షాలన్నీ విడివిడిగా పోటీ చేయాలని చెబుతున్నారని అన్నారు. ఈసారి తెలుగుదేశం, జనసేన సీపీఎం, సీపీఐ అన్ని పార్టీలు కలిసి వచ్చి వైసీపీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రాలేడని రామకృష్ణ వెల్లడించారు. జగన్ ప్రతిసారీ 175 సీట్లు వస్తాయని అంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీ చతికిలబడే అవకాశం ఉందని విమర్శించారు. ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయకుండా జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయకపోతే.. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓటర్లకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఇచ్చి ఓటను కొనుగోలు చేస్తారని విమర్శించారు. మెున్న జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తామంతా కలిసి పోటీ చేయకపోవడం వల్లే వైసీపీ గెలిచిందని రామకృష్ణ వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిల్లో కలిసి పోటీ చేయడం వల్లే జగన్ ఒడిపోయారని పేర్కొన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వట్లేదని, ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. ముందస్తు ఎన్నికలు పెడితే వైసీపీని ప్రజలు ముందుగానే ఇంటికి పంపిస్తారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పులివెందులలో సైతం గెలవలేడని రామకృష్ణ విమర్శించారు.
ఇవీ చదవండి: