Inappropriate comments on CM: ముఖ్యమంత్రిని దూషించారనే అభియోగంపై అరెస్టైన ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీసు స్టేషన్ పరిధిలోని ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావుకు బెయిల్ మంజూరైంది. జగ్గయ్యపేట కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తరపున న్యాయవాదులు డి.కోటేశ్వరరావు, మాగులూరి హరిబాబు వాదనలు వినిపించారు. అనంతరం జగ్గయ్యపేట కోర్టు ఏఆర్ కానిస్టేబుల్‌కు బెయిల్ మంజూరు చేసింది.
ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో హైవే మొబైల్ డ్రైవర్‌గా పని చేస్తున్న తన్నీరు వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రిని దూషించారని నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వరరావు విధుల్లో ఉన్న సమయంలో బయటి వ్యక్తులు పోలీసుల జీతాల గురించి ప్రస్తావించారు. దానిపై కానిస్టేబుల్ ముఖ్యమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను సదరు వ్యక్తులు పోలీసు అధికారులకు పంపారు.
కానిస్టేబుల్ వెంటేశ్వరరావును అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం జగ్గయ్యపేట న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో జగ్గయ్యపేట సబ్‌జైలుకు తరలించారు. పోలీసులకు మూడు నెలల జీతాలు వేయకపోతే.. అప్పుడు గవర్నర్ పాలన వస్తుదంటూ వెంకటేశ్వరరావు.. ముఖ్యమంత్రిని అసభ్యపదజాలంతో దూషించినట్లు సామాజిక మాద్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు కానిస్టేబుల్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని చిల్లకల్లు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: