CM Chandrababu met PM Modi : సీఎం నారా చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు, అమరావతి సహా వివిధ కీలకాంశాలపై మోదీతో చర్చించారు. గంటకు పైగా సాగిన భేటీలో గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చడం, ఆర్థిక లోటును భర్తీ చేసేలా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు. అలాగే గత బడ్జెట్‌లో కేటాయించిన అంశాలను పూర్తి చేయడంతో పాటు ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టే కేంద్ర బడ్జెట్‌లో మరింత సాయం చేయాలని అడిగినట్లు తెలుస్తోంది. గత 6 నెలల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని చంద్రబాబు మోదీకి వివరించినట్టు సమాచారం.
రాష్ట్రానికి నిధులపై చర్చ : మోదీతో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమిత్‌షాతో సుమారు 45 నిమిషాలు పాటు వివిధ అంశాలపై చర్చించారు. తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్‌తో 45 నిమిషాలు కొనసాగిన సమావేశంలో రాష్ట్రానికి నిధులపై చర్చించినట్లు సమాచారం.
విశాఖ ఉక్కు పరిశ్రమపై చర్చ : మధ్యాహ్నం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని కలిసిన ముఖ్యమంత్రి చంద్రాబాబు విశాఖ ఉక్కును కాపాడుకోవడంపై కీలకంగా చర్చించారు. ప్రైవేటీకరణ జరగకుండా చూడటంపై సమాలోచనలు చేశారు. ఆ తర్వాత రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో భేటీ ఆయిన సీఎం రైల్వేజోన్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రైల్వే పనులు వీలైనంత త్వరగా పూర్తిచే యాలని కోరినట్లు సమాచారం. ఈ పనుల్లో రాష్ట్రం తరఫున అన్నివిధాలా తోడ్పాటును అందిస్తామని చెప్పారు. మధ్యాహ్నం ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఆ భేటీ తర్వాత అక్కడే అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ ఉదయం మాజీ ప్రధాని వాజ్‌పేయీ శత జయంతి సందర్భంగా ఆయన సమాధి "సదైవ్ అటల్" వద్ద పుష్పాంజలి ఘటించారు.
దిల్లీలో మారిన లెక్క - రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులపైనే వరుస భేటీలు - CBN Delhi Tour