CM Video Conference On Rains: మాండౌస్ తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంతో పంటనష్టం అంచనాలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని సుచించారు. నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించి.. వారం రోజుల్లో ముగించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్లు, అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. పంట నష్టాన్ని చూసి రైతులు నిరాశకు గురి కావొద్దని పేర్కొన్నారు. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదనే మాట రాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటున్నారన్న మాట రాకుండా.. సాధారణ ధాన్యానికి అందించే ధరనే అందించాలని అధికారులకు సూచించారు.
తర్వాత పంటకు 80 శాతం సబ్సిడీతో.. రైతులకు విత్తనాలు అందించాలని అన్నారు. ఇళ్లు ముంపునకు గురైతే కుటుంబానికి 2 వేల రూపాయలు ఆర్థిక సాయం, రేషన్ ఇవ్వనున్నట్లు సమావేశంలో తెలిపారు. ఇళ్లలోకి వరద వచ్చినా సరే.. ప్రభుత్వం పట్టించుకోలేదనే విధంగా చేయకుండా.. ఇళ్లలోకి వరదనీరు వస్తే కచ్చితంగా బాధితులకు సహాయం అందించాలని సీఎం సూచించారు. పట్టణాలు, పల్లెలు అని చూడకుండా బాధితులకు సహాయమందించాలని తెలిపారు. గోడ కూలి ఒకరు మరణించినట్లు సమాచారం వచ్చిందని.. మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించాలని ఆదేశించారు.
ఇవీ చదవండి: