Demands of Anganwadi Workers: అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలకు పిలవాలని.. లేదంటే దీర్ఘకాల పోరాటం చేస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికై శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బడ్జెట్లో అంగన్వాడీలకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలన్నారు. అంగన్వాడీ పోస్టింగులను ప్రజా ప్రతినిధులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పేరుకే సంపూర్ణ పోషణ.. ఐదు గ్రాములతో పోషణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సెంటర్ల నిర్వహణకై పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని.. నెలలు తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంటే సెంటర్ల నిర్వహణ కష్టం అవుతుందన్నారు. తక్షణమే అంగన్వాడీలను చర్చలకు పిలిచి పెండింగ్ వేతనాలను, బిల్లులను చెల్లించాలని, ఎన్నికల సమయంలో కనీస వేతనం అమలు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
"ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే అధికంగా వేతనాలు పెంచాలని అడుగుతున్నాం. మన రాష్ట్రంలో కూడా వెంటనే గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. హెల్పర్లకు వేతనాలు ఇస్తున్నారు.. అయ్యా మాకు పని భారం పెరిగింది.. జీతాలు పెంచండి అని అడిగితే ఇప్పటి వరకూ దిక్కే లేదు. మినీ సెంటర్‌ని.. మెయిన్ సెంటర్‌గా మార్చమని అడిగితే పట్టించుకునే నాథుడే లేరు. వయో పరిమితి పెంచడం లేదు. కనీసం ఈ రోజు.. ఒక వర్కర్ చనిపోతో బీమా కాదు కదా మట్టి ఖర్చులు కూడా ఇచ్చే దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో. అందుకని వాళ్ల ప్రభుత్వంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అడుగుతున్నాం. 2017 నుంచి ఇప్పటి వరకూ అంగన్వాడీలకు టీఏ బిల్స్ ఇవ్వలేదు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు పెట్టుబడులు పెడుతున్నారు.. కానీ నెలనెలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు". - సుబ్బరావమ్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
"ఒక మినీ వర్కర్ కానీ, ఒక హెల్పర్ కానీ ఎవరికీ కూడా న్యాయం చేయకుండా.. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అందుకనే మేము పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు.. ఒక్క రోజు పోరాటానికే పిలుపునిచ్చాం.. కానీ రాబోయే రోజుల్లో నిరవధిక పోరాటం జరగబోతోంది. సమస్యను పరిష్కారం చేయాలనుకుంటున్నారో.. లేదంటే మరింత జఠిలం చేయాలనుకుంటున్నారో అనేది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది. కార్మికులలో ఉన్న అసంతృప్తిని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి. సమస్యను తక్షణం పరిష్కారం చేయాలి". - సీహెచ్ నరసింహారావు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: