BJP leader Bandi Sanjay Fires On CM YS Jagan: తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అవినీతి, అప్పులు, అరాచకాల్లో పోటీపడి దోచుకుంటున్నాయని.. బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. తాను రూ.5 లక్షల కోట్ల రుణం తీసుకున్నానని తెలంగాణ సీఎం చెబుతుంటే... తానేం తక్కువ కాదు.. ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశానని సీఎం జగన్ చెప్తున్నారని ఆరోపించారు. ఏటా వడ్డీల పేరుతో రూ. 50 వేల కోట్లు చెల్లిస్తున్నానని ఏపీ సీఎం చెబుతున్నారని బండి ధ్వజమెత్తారు. డ్రగ్స్, గంజాయి, మద్యం, భూకబ్జాల దందాలతో దోచుకు తింటున్నారని సంజయ్‌కుమార్ ఆరోపించారు. మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తున్న సర్కార్ ప్రపంచంలోనే లేదని ఎద్దేవా చేశారు. ఆ ఖ్యాతి ఏపీ సర్కార్‌కే(Andhra Pradesh Government ) దక్కుతుందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యమేలుతోన్న అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిన సమయం ఆసన్నమైందని బండి సంజయ్ పేర్కొన్నారు.
BRSకు జాతీయ అధ్యక్షుడు ఎవరు?.. KCRకు బండి సూటి ప్రశ్నలు
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో(BJP office) నిర్వహించిన ఓటరు అవగాహన రాష్ట్ర స్థాయి ప్రశిక్షణ కార్యక్రమంలో.. ముఖ్య అతిధిగా హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా బండి సంజయ్ మాట్లాడారు. మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని బండి ఆరోపించారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 10 వేల ఓట్లకుపైగా నకిలీ ఓట్లను నమోదు చేసే పనిలో నిమగ్నమైందని వెల్లడించారు. ఇదే అంశాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. అందులో భాగంగానే అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేశారన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీల నేతలను కుల సంఘాల నేతలుగా చిత్రీకరిస్తూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతోందని రెండు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు సంజయ్ అన్నారు.
'ముందస్తు ఎన్నికలకు మేము కూడా సిద్ధమే.. కానీ' : బండి సంజయ్
ఏపీలో జగన్ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే.. అప్పులు, అవినీతిలో ప్రగతి మాత్రమేనని దుయ్యబట్టారు. మద్యం దరఖాస్తుల ద్వారానే రూ. 2500 కోట్ల రూపాయలకుపైగా సంపాదించానని కేసీఆర్ చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ఏపీలో మాత్రం ఏకంగా మద్యం బాండ్ల పేరుతో తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఇదే వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. గంజాయి స్మగ్లర్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందన్నారు. హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా నియమితులైన తితిదే ఛైర్మన్(TTD chairman)కు తిరుమలలో అడవులున్న విషయమే తెలియదని చెబుతున్నారంటే- అతనికి ‘‘పుష్ప’’ సినిమా చూపించాలేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.